క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ అమితమైన వినోదం పంచింది. అదే సమయంలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు కొందరి జీవితాల్ని బలితీసుకుంటున్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లాలో బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు ఆత్మహత్యకు యత్నించటం... వారిలో ఒకరు మరణించటం తీవ్ర విషాదం నింపింది. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన సురేశ్, బెల్లంకొండ మండలం బుడగజంగాల కాలనీకి చెందిన కుమార్ ఇద్దరూ వరుసకు సోదరులు అవుతారు. వీరిద్దరూ ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ వారిని ఈ ఊబిలోకి దించింది.
అయితే బెట్టింగుల్లో 2 లక్షల మేర నష్టపోయారు. ఆ డబ్బులు ఇవ్వాలని బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఇంట్లో తెలిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో ఇద్దరూ శీతలపానీయంలో పురుగుల మందు కలిపి ఆత్మహత్యకు యత్నించారు. దీనికి సంబంధించి సెల్ఫీ వీడియోను బంధువులకు వాట్సప్‌లో పంపించారు. వెంటనే బంధువులు అప్రమత్తమై ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే సురేశ్ మరణించగా... కుమార్ మాత్రం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.