సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తులు, వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు చేసిన ఓ యువకునికి పెద్దపల్లి తహసీల్దార్ భారీ జరిమానా విధించారు. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన కందుల అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర, అనుచిత పోస్టులు చేస్తున్నాడని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ చేసినందుకు రూ.2లక్షల ఫైన్
సామాజిక మాధ్యమాల ద్వారా కొందరిపై వ్యక్తిగత దూషణలు చేసిన వ్యక్తికి పెద్దపల్లి తహసీల్దార్ భారీ జరిమానా విధించారు. వ్యక్తిగతంగా కొందర్ని, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని అనుచిత పోస్టులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఎస్సై జానీపాషా తెలిపారు.
గతంలోనే అశోక్‌ను హెచ్చరించి.. బుద్ధి చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని ఎస్సై షేక్ జానీపాషా తెలిపారు. అశోక్‌పై మళ్లీ ఫిర్యాదులు రావడం వల్ల కేసు నమోదు చేసి పెద్దపల్లి తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. సదరు తహసీల్దార్ అశోక్‌కు రూ.2 లక్షల భారీ జరిమానా విధించినట్లు చెప్పారు.
ప్రస్తుతం 6 నెలల కాలపరిమితి కోసం వ్యక్తిగత పూచీపై విడుదల చేశామని ఎస్సై షేక్ జానీపాషా వెల్లడించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యక్తిగత, వర్గాల వారీగా దూషణలు, అనుచిత పోస్టులు చేసే వారిపై నిఘా పెట్టి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.