ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగకు సమీపంలోని స్వర్ణముఖి నది బ్రిడ్జిపై రాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. 9ఏళ్ల పాప నదిలో పడి గల్లంతైంది. నాయుడుపేట పురపాలక సంఘం తుమ్మూరుకు చెందిన దంపతులు మురళి- సుజాతమ్మ. తమ కుమార్తె ప్రవళికతో కలిసి ద్విచక్రవాహనంపై స్వర్ణముఖి ఒడ్డున ఉన్న ఆలయానికి వెళ్లి తిరిగి వెళ్తున్నారు. అదే మార్గంలో మేనకూరు కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు బైకుపై వస్తున్నారు.
ఈ క్రమంలో ఎదురుగా కారు రావడం వల్ల అదుపుతప్పి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మురళి- సుజాతమ్మ దంపతులు కుమార్తెతో సహ నదిలో పడిపోయారు. ఆ దంపతులు ఒడ్డుకు చేరినప్పటికీ బాలిక ఆచూకీ దోరకలేదు. యువకులు ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం వల్ల నాయుడుపేట ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో బాలిక నీళ్లలో పడి గల్లంతైంది. పోలీసు అగ్నిమాపక శాఖ అధికారులు బాలిక కోసం గాలింపు చేపట్టారు.