హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. వర్షబీభత్సానికి బండ్లగూడలోని గౌస్‌నగర్‌లో రెండు ఇళ్లు కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గౌస్‌నగర్‌లో ఎత్తైన ప్రదేశం నుంచి బండరాళ్లు జారిపడడంతో... ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు రెండు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు శిథిలాల కింది నుంచి మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురికి ఒవైసీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విషాదం... పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి
00:08 October 14
విషాదం... పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 8 మంది మృతి
ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... స్థానికులను వివరాలు అడిగి తెలుకున్నారు. క్షతగాత్రులను చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. బాధితులకు అండగా ఉండామని హామీ ఇచ్చారు. అటు విపత్తు నిర్వహణ బృందాల సాయంతో శిథిలాలు తొలగించిన పోలీసులు... సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
మృతుల్లో గౌస్‌నగర్‌కు చెందిన దంపతులు మహ్మద్ సమద్, సభా హస్మీనితో పాటు టోలిచౌకికి చెందిన ఫౌజియానాజ్, సయ్యద్ జునైద్, చాంద్రాయణగుట్టకు చెందిన అన్వారిబేగం, జకేరా బేగం సహా ముగ్గురు చిన్నారులు ఉన్నారు. రెండు ఇళ్లల్లో 8మంది చనిపోయిన ఘటనతో గౌస్‌నగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. అప్పటివరకూ తమతోనే ఉన్న వారందరూ నిద్రలోనే కన్నుమూశారని తెలియగానే స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎడతెగని వానల కారణంగా ఇళ్లు ధ్వంసమై 8మంది పేదబతుకులు చితికిపోయిన తీరు పలువురిని కంటతడిపెట్టిస్తోంది. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.