తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాపాడేందుకు వందల మంది యత్నం.. అయినా దక్కని ప్రాణం

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విషాదం జరిగింది. పాల ప్యాకెట్ కోసం కిరాణాషాపునకు వెళ్లిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని కాపాడేందుకు వందల మంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

chinnari maranam
కాపాడేందుకు వందల మంది యత్నం.. అయినా దక్కని ప్రాణం

By

Published : Jul 12, 2020, 10:56 PM IST

కిరాణా దుకాణానికి వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురమ్మని తల్లి చెప్పటంతో పరిగెత్తుత్తూ వెళ్లింది ఆ చిన్నారి. ఇంటి సమీపంలోని దుకాణం మూసివేసి ఉండటంతో కొంచెం ముందుకు వెళ్లింది. రోడ్డు దాటుతున్న సమయంలో బాలిక చెప్పులు డ్రైన్​లో పడిపోయాయి. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆ చిన్నారి ప్రమాదవశాత్తు అందులో పడింది. అక్కడే ఉన్న చిన్నారులు దీనిని గుర్తించి స్థానికులకు చెప్పారు. పాపను కాపాడేందుకు యువకులు విశ్వ ప్రయత్నం చేశారు. వందల మంది ఏకమై డ్రైనేజీలో వెతుకులాడారు.

దాదాపు 6 అడుగుల లోతుకు పైగానే ఉన్న డ్రైనేజీలోకి దిగి పాపను వెతికేందుకు ప్రయత్నించారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి డ్రైనేజీ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పాపను వెతికే క్రమంలో కొందరు యువకులకు స్వల్ప గాయాలయయ్యాయి. పాప పడిపోయిన ప్రాంతం నుంచి కిలోమీటరు తరువాత ఎట్టకేలకు చిన్నారి ఆచూకీని గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా... అప్పటికే బాలిక మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పోలీస్​ స్టేషన్​ సమీపంలో జరిగింది.

మృతురాలిని తర్వానిపేటకు చెందిన వడ్రంగి మెస్త్రీ పలివేల ప్రసాద్, పల్లవి దంపతుల కుమార్తె చంద్రకళగా గుర్తించారు. వీరికి ఏడేళ్ల చంద్రకళతో పాటు నాలుగేళ్ల బాబు సంతానం. అప్పటివరకూ తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి అంతలోనే మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోధన మిన్నంటింది.

ఇదీ చూడండి:జర జాగ్రత్త: ఆ జిల్లాల్లో రాగల మూడురోజులు భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details