జీహెచ్ఎంసీతో పాటు పలు ప్రైవేటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలిప్పిస్తామంటూ అమాయకులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఎక్సోరా సంస్థలో గంగాధర్ ఆపరేషనల్ మేనేజర్‌గా, మహేందర్ హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ జీహెచ్ఎంసీ, ఇతర ప్రైవేటు సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామంటూ ప్రచారం ప్రారంభించారు. దానికి అనుగుణంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. స్వీపర్ ఉద్యోగానికి రూ.50,000, సూపర్వైజర్ ఉద్యోగానికి రూ.లక్ష చొప్పున సుమారు 1500 మంది వద్ద దాదాపు రూ.7 కోట్ల వరకు వసూలు చేశారు. సంస్థ తరపున ఐడీ కార్డులూ ఇచ్చారు.
3 నెలలు బాధితులతో స్వీపింగ్ పనులు చేయించారు. నెలకు రూ.14 వేల జీతం అంటూ నమ్మబలికి.. తీరా జీతం డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వీరి అసలు రంగు బయటపడింది. ఈ క్రమంలోనే బాధితులు గంగాధర్, మహేందర్‌లపై ఎక్సోరా సంస్థలో ఫిర్యాదు చేశారు. ఐసీఎస్ సంస్థ వారిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేవైఎం రాష్ట్ర పబ్లిసిటీ కన్వీనర్ పొన్న వెంకట రమణ సైతం ఆధారాలతో సహా శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.