అక్టోబర్ మూడో తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ కార్గోలో అనుమానాస్పద పార్శిల్‌ను అధికారులు గుర్తించారు. పార్శిల్‌పై చిరునామా లేకపోవడం వల్ల కస్టమ్స్ అధికారులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న కస్టమ్స్ అధికారులు పార్శిల్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో ఆరున్నర కోట్లకుపైగా విలువైన బంగారాన్ని గుర్తించారు.
ఇప్పటి వరకు ఆ బంగారం తమదంటూ ఎవరూ ముందుకు రాలేదని కస్టమ్స్ అధికారులు తెలిపారు. పార్శిల్‌కు సంబంధించి చిరునామాలు కాని, పత్రాలు కాని ఏలాంటి లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు దేశంలో 12 ఏజెన్సీలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో విదేశీ బిస్కెట్లతోపాటు స్వదేశీ బిస్కెట్లు, పెద్ద ఎత్తున ఆభరణాలు ఉండడం వల్ల తెరవెనుక ఎవరున్నారన్న కోణంలో విచారిస్తున్నారు.