వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఐదుగురిని బలితీసుకుంది. ఆగి ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరొకరు చనిపోయారు. తాండూరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సంగారెడ్డి నుంచి తాండూరుకు వస్తున్న లారీ... ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన కూలీలు శేణీబాయి, సంధ్య, నితిన్, సోనాబాయి, రేణుకాబాయిగా పోలీసులు గుర్తించారు.
పొగమంచు కారణమా?
అతివేగం, పొగమంచే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. మృతులంతా పేద కుటుంబాలకు చెందిన వారని... పనిచేస్తేనే పూట గడుస్తుందని తెలిపారు. చనిపోయిన వారంతా దగ్గరి బంధువులని పేర్కొన్నారు. మృతుల్లో చదువుకునే పిల్లలు ఉన్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా... ఆర్ అండ్ బీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.