తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

5 నెలలు.. 485 సైబర్‌ మోసాలు! - సైబరాబాద్​లో సైబర్​ క్రైమ్ నేరాలు​

5 నెలలు... 485 సైబర్ కేసులు.. సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో సైబర్ మోసగాళ్ల ట్రాక్ రికార్డ్ ఇది. గతేడాది కేసుల మార్క్​ను ఐదు నెలల్లోనే దాటి సవాల్ విసురుతున్నారు. సైబర్​ మోసగాళ్ల వలకు చిక్కి బాధితులు బ్యాంక్​ ఖాతా గుల్ల చేసుకుంటున్నారు.

cyber crimes in hyderabad
cyber crimes in hyderabad

By

Published : Jun 6, 2020, 7:55 AM IST

సైబర్‌ కేటుగాళ్లకు చిక్కి నిండా మునుగుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. 2019లో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 477 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అయిదు నెలల్లోనే ఏకంగా 485 మార్కుకు చేరుకోవడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఈ కేసుల సంఖ్య 1,200 వరకు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2018లో 293 కేసులు నమోదు కాగా రూ.16 కోట్ల మేర బాధితులు నష్టపోయారు. గత ఏడాది రూ.25.23 కోట్ల వరకు కోల్పోయారు.

ఎక్కువగా ఆ మూడు రకాల మోసాలు

ఈ అయిదు నెలల్లో నమోదైన కేసులపై సైబర్‌ క్రైమ్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్‌ అధ్యయనం చేసి మూడు రకాల మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు.

  • 24 గంటల్లో కేవైసీ అప్‌డేట్‌ చేయకపోతే మీ పేటీఎం ఖాతా స్తంభించిపోతుందంటూ ఎస్‌ఎంఎస్‌ పంపించి ముగ్గులోకి దింపుతున్నారు. కొందరు లింక్‌ పంపి ఖాతా వివరాలడుగుతున్నారు. మరికొందరు క్విక్‌ సపోర్ట్‌, ఎనీ డెస్క్‌ యాప్‌, టీం వ్యూయర్‌ తదితర రిమోట్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోమంటున్నారు. రూపాయి లేదా రూ.10 పేటీఎం వ్యాలెట్‌లో జమచేసే క్రమంలో డెబిట్‌/క్రెడిట్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకుని ముంచేస్తున్నారు.
  • బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని.. మీ కార్డు బ్లాక్‌ అవుతోందని ఓటీపీ, ఇతర వివరాలను తెలుసుకుని టోకరా వేస్తున్నారు.
  • ఎయిర్‌టెల్‌, ఐడియా కస్టమర్‌ కేర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని సిమ్‌ కార్డు బ్లాక్‌ పేరిట మోసగిస్తున్నారు.

ఫోన్‌ ఎత్తగానే..

మియాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి మే 24న ఓ నంబరు నుంచి కాల్‌ వచ్చింది. పేటీఎం కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నామని.. కేవైసీని అప్‌డేట్‌ చేసుకోకపోతే బ్లాక్‌ అవుతుందంటూ చెప్పి నిమిషాల్లోనే రూ.2.50 లక్షలు కొల్లగొట్టారు. హఫీజ్‌పేట్‌కు చెందిన ఓ మహిళకు సైతం ఇలానే ఫోన్‌ చేసి రూ.1.50 లక్షలు స్వాహా చేశారు. ఆమె ఈనెల 2న సైబరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎవరడిగినా చెప్పొద్దు

"మీ బ్యాంకు ఖాతా, డెబిట్‌/క్రెడిట్‌ కార్డు వివరాలను గోప్యంగా ఉంచాలి. ఎవరికీ చెప్పొద్దు. తరచూ పిన్‌ నంబర్‌, పాస్‌వర్డ్స్‌ మార్చుకోవాలి. బ్యాంక్‌ లేదా ఏ సంస్థ మీకు ఫోన్‌ చేసి ఇటువంటివి అడగదు. ఆ తరహా ఎస్‌ఎంఎస్‌, ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, షాపింగ్‌, రీఛార్జి చేసే క్రమంలో జాగ్రత్తలు అవసరం. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచకపోవడమే ఉత్తమం. ఏ మాత్రం అనుమానమొచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి."

- శ్రీనివాస్‌కుమార్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ

ఇదీ చదవండి:ఐదు రోజులు... ఆరు హత్యలు...

ABOUT THE AUTHOR

...view details