తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి - vijayawada car fire news

పట్టపగలే కారులో ఉన్న వ్యక్తులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఘటన విజయవాడలో సంచలనం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వేణుగోపాల్​ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. భూవివాదాలే హత్యాయత్నానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.

3 injured after car set ablaze in vijayawada
3 injured after car set ablaze in vijayawada

By

Published : Aug 18, 2020, 11:33 AM IST

భూ వివాదాలు హంతకులుగా మారుస్తున్నాయి. పట్టపగలే కారులో ఉన్న మనుషులపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. తాడేపల్లిలో నివాసం ఉంటున్న మంగళగిరి మండలం రామచంద్రపాలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి, విజయవాడకు చెందిన కృష్ణారెడ్డి, గంగాధర్, నాగమల్లి దంపతులు పరిచయస్థులు. 2014 నుంచి వీరు రియల్ ఎస్టేట్, పాతకార్లు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి సంబంధించిన ఓ స్థలం అమ్మే విషయమై నాలుగు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సదరు స్థలం కొనుగోలుకు సంబంధించిన పార్టీ ఉందని, వారిని కలిస్తే పని అవుతుందని వేణుగోపాల్​ రెడ్డి మిగతా ముగ్గురికి చెప్పాడు. కృష్ణా రెడ్డి, గంగాధర్, నాగమల్లి కలిసి కారులో బయలుదేరారు. విజయవాడలోని కృష్ణలంక సూబ్రిడ్జి వద్ద వేచి ఉన్న వేణుగోపాల్​ రెడ్డిని ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి తాడేపల్లిలోని ఓ హోటల్​కు వెళ్లారు.

తాడేపల్లిలో కాకుండా విజయవాడలోనే భూమిని కొనుగోలు చేసే పార్టీ ఉందని వేణుగోపాల్​ రెడ్డి చెప్పడంతో తిరిగి వచ్చారు. నగరంలో కాసేపు కారులో తిరిగారు. ఓ దుకాణం వద్ద ఆగి స్వీట్లు కొనుగోలు చేశారు. అనంతరం నగరంలోని నోవాటెల్ హోటల్​లో సమావేశమవుదామని వేణుగోపాల్​ రెడ్డి చెప్పాడు. దీంతో హోటల్ సమీపంలో కారు ఆపి నలుగురు వేచి ఉన్నారు. దాదాపు అరగంటసేపు కారులోనే మాట్లాడుకున్నారు. డ్రైవర్ సీటులో వేణుగోపాల్ రెడ్డి కూర్చుని ఉండగా పక్కన కృష్ణారెడ్డి, వెనక సీట్లో గంగాధర్, నాగమల్లి ఉన్నారు. మాటల మధ్యలో వారి నడుమ వివాదం తలెత్తింది. వేణుగోపాల్ రెడ్డి ముందుగానే మద్యం సీసాలో తెచ్చిన పెట్రోల్​ను తన పక్కనే కూర్చున్న కృష్ణా రెడ్డిపై పోసి నిప్పంటించాడు. వెంటనే కారులో నుంచి కిందకు దిగి డోర్ లాక్ వేసి పెద్దగా అరుచుకుంటూ పరారయ్యాడు.

ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో నాగమల్లి, గంగాధర కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బెంబేలెత్తిపోయిన నాగమల్లి అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటనను చూసిన కార్తీక్ అనే డెలివరీ బాయ్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి చెప్పాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని.. మంటలను ఆర్పి .. బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న డీసీపీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని, బాధితుడు గంగాధర్​ను పోలీసులు విచారిస్తున్నారు.

ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి దగ్గర కృష్ణా రెడ్డి, గంగాధర్​లు రూ.2.7 కోట్ల వరకు అప్పు తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని నెలల నుంచి వేణుగోపాల్ రెడ్డి తనకు ఇవ్వాల్సిన డబ్బులను అడుగుతున్నాడు. పొలం అమ్మి ఇస్తామని వాళ్లు చెబుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సదరు భూమిని అమ్మేందుకే అందురూ కలిసి బయలుదేరారు. కృష్ణా రెడ్డి, గంగాధర్​లు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుండడంతో పక్కా ప్రణాళికతోనే వేణుగోపాల్ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలిసింది.

కాసేపు కారులోనే కూర్చుని మాట్లాడుకున్నాక.. ఎవరైనా సిగరెట్ తాగుతారా .. అంటూ వేణుగోపాల్ రెడ్డి అడిగాడని బాధితుడు గంగాధర్ చెపుతున్నాడు. ఇంత పెద్ద డీల్ జరుగుతుందంటే కొంచెం టెన్షన్​గా ఉందని అన్నానని.. అంతలోనే తన వెంట తెచ్చుకున్న సీసాలోని పెట్రోల్​ను కృష్ణారెడ్డిపై పోసి నిప్పంటించాడని తెలిపారు. ఆ తర్వాత వెంటనే కిందకు దిగి అక్కడి నుంచి వేణుగోపాల్ రెడ్డి పారిపోయాడని గంగాధర్ వెల్లడించాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణా రెడ్డిని విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లగా ఎక్కడా చేర్చుకోలేదు. దీంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలవ్వడంతో ఇతని పరిస్థితి విషమంగా ఉంది.

దారుణం: కారులో ముగ్గురు ఉండగానే నిప్పంటించిన వ్యక్తి

ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details