వికారాబాద్ జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 930 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో వెయ్యి కిలోమీటర్లు ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్ర, జాతీయ రహదారులు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపైనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. జిల్లాలో ఇంకా ఎక్కడెక్కడ, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనే కారణాలను అన్వేషించారు. ఈ ప్రక్రియలో భాగంగా 28 ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఇందులో మన్నెగూడ-రావులపల్లి వరకు మొత్తం 17 ఉండటం గమనార్హం. విస్తరణ, అభివృద్ధి చేశాకే ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారులపైనా జరుగుతున్న ప్రమాదాలపై చర్చించారు.
చేపట్టాల్సిన పనులు ఇవి..
వేగ నియంత్రికలు, సూచిక బోర్డుల ఏర్పాటు , శిరస్త్రాణం ధరించేలా చర్యలు తీసుకోవడం. జాతీయ, రాష్ట్ర, ఇతర ప్రధాన రహదారులకు వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన చోట్ల వేగ నియంత్రికలు నిర్మించాలని నిర్ణయించారు. ఫలితంగా వాహన చోదకుడు వేగాన్ని తగ్గించి, చుట్టుపక్కల వాహనాలను గమనించి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డులు (సైన్ బోర్డులు), దారి మలుపులను తెలిపే సూచిక బోర్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్‌ను ఏర్పాటు చేయాలి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కార్లలో సీటు బెల్టు, ఇతర మోటారు వాహన చట్టంలోని నిబంధనలు అమలు చేయడం. ఈ మూడింటిని అమలు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని రహదారి భద్రత కమిటీ సూచించింది.