ప్రేమ వివాహం వల్ల 2 కుటుంబాల ఘర్షణ... ఒకరు మృతి
22:38 October 07
ప్రేమ వివాహం వల్ల 2 కుటుంబాల ఘర్షణ... ఒకరు మృతి
నాలుగు నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం విషయమై ఇరువర్గాల బంధువుల మధ్య ఘర్షణ జరిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో చోటుచేసుకుంది. గార్ల మండలం పోచారం గ్రామానికి చెందిన ప్రశాంత్, అదే గ్రామానికి చెందిన లావణ్య నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. కల్యాణ లక్ష్మి కోసం కావాల్సిన పత్రాలు ఇవ్వాలని అమ్మాయి తరుఫు బంధువులైన కోటయ్య, నరేశ్ అబ్బాయి ప్రశాంత్‌ను అడిగారు.
ప్రశాంత్ పత్రాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గంధంపల్లిలోని ఎస్సీ కాలనీలో బంధువుల ఇంట్లో ఉన్న అబ్బాయి ప్రశాంత్‌పై చేయి చేసుకోవడం వల్ల ఇరు వర్గాల బంధువుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అమ్మాయి లావణ్య తరఫు బంధువులు అబ్బాయి తరఫు బంధువు మాతంగి రమణయ్య పై దాడి చేశారు. గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతికి కారణమైన వారి ఇంటిపై అబ్బాయి తరఫు వారు దాడి చేసి సామాన్లు ధ్వంసం చేశారు. మృతుడి సోదరుడు ఉపేందర్ బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో బయ్యారం సీఐ. తిరుపతి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:కన్న కొడుకుని బలికొన్న తల్లి వివాహేతర సంబంధం