ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం సీఎం జగన్‌కు నివేదికను అందజేసింది. ఘటనపై అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేల్చింది.
ఎల్జీ పాలిమర్స్ కేసులో సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మంది అరెస్టు - ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది అరెస్టు
20:50 July 07
ఎల్జీ పాలిమర్స్ కేసులో సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మంది అరెస్టు
కమిటీ ఏం చెప్పిందంటే...?
విశాఖ గ్యాస్ లీక్ విషాదం వెనుక అడుగడుగునా... ఎల్జీ పాలిమర్స్ సంస్థ నిర్లక్ష్యం ఉందని హై పవర్ కమిటీ తేల్చింది. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు నీరబ్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వం నియమించిన 9 మంది సభ్యుల హైపవర్ కమిటీ.... ఈ మేరకు సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్నీ పరిశీలించిన కమిటీ... ఆయా వివరాలన్నింటినీ క్రోడీకరించి 350 పేజీలతో ప్రధాన నివేదిక రూపొందించింది. పలు ప్రశ్నలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి సమాధానాలు రాబట్టింది. పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.
గ్యాస్ లీక్ దుర్ఘటనకు ప్రధానంగా 3 కారణాలను కమిటీ పేర్కొంది. మరమ్మతులను అస్తవ్యస్తంగా నిర్వహించడం, ప్రమాద సంకేతాలు వెలువడినా పట్టించుకోకపోవడం, లాక్‌డౌన్‌లోనూ అప్రమత్తత కొరవడటాన్ని గుర్తించినట్లు తెలిపింది.
ఘటన తర్వాత అత్యవసర చర్యల్లోనూ సంస్థ వైఫల్యం ప్రమాద తీవ్రతను పెంచాయని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. 36 సైరన్లు ఉన్నా ఒక్కటీ పని చేయకపోవడం వల్ల పరిసర ప్రాంతాల వారు తప్పించుకొనే అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. సంస్థ సిబ్బందిలోనూ అవగాహన లోపించినట్లు గుర్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల నివారణకు ప్రతి రాష్ట్రమూ, కేంద్రంలో ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డుల ఏర్పాటుకు హై పవర్ కమిటీ సిఫార్సు చేసింది. వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని ప్రతి పరిశ్రమా వాటి కిందకు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించింది.