యెమెన్‌లోని ఏడెన్ విమానాశ్రయంలో బుధవారం విధ్వంసం జరిగింది. ప్రధానమంత్రి మయీన్ అబ్దుల్ మాలిక్ సయీద్ సహా పలువురు మంత్రులతో కూడిన విమానాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది మృత్యువాతపడ్డారు. 110 మందికిపైగా గాయాలయ్యాయి. ప్రధాని సహా ఇతర మంత్రులకు ముప్పు తప్పింది. వారందర్నీ భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అయితే.. విధ్వంసానికి పాల్పడింది ఎవరన్న వివరాలు తెలియరాలేదు.
ప్రధానమంత్రి, పలువురు మంత్రులతో సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నుంచి వచ్చిన విమానం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే డ్రోన్ల సాయంతో బాంబు దాడి చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల్లో రెడ్ క్రాస్ కార్యకర్తలు ఉన్నారని తెలిపాయి. వారు యెమెన్ వాసులో విదేశీయులో ఇంకా నిర్ధారణ కాలేదని పేర్కొన్నాయి. విమానాశ్రయంలో దాడి అనంతరం నగరంలోని ఓ భవంతిలో కేబినెట్ మంత్రులను అధికారులు ఉంచగా.. అక్కడికి సమీపంలోనే మరో పేలుడు సంభవించడం గమనార్హం.