సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు శుద్ధి కేంద్రాలపై జరిగిన దాడికి బాధ్యత తమదేనని హుతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ చమురు కేంద్రాలపై మరిన్ని దాడులకు పాల్పడనున్నట్లు తాజాగా వెల్లడించారు. విదేశీయులు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరించారు.
తూర్పు సౌదీ అరేబియాలోని అబ్‌కైక్, ఖురైస్‌లో ఉన్న ఆరాంకో ప్లాంట్లపై గత శనివారం యెమెన్‌కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడులు చేశారు. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య విభేదాల వల్లే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారులకు ఇరాన్ గత కొన్నేళ్లుగా సాయం చేస్తోంది. ఇరాన్-సౌదీ అరేబియాల మధ్య విభేదాల నేపథ్యంలో... హుతీ-సౌదీ అరేబియా మధ్య కూడా చాలాకాలంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే హుతీలు తాజా దాడులకు పాల్పడ్డారు.
పెరిగిన చమురు ధరలు
డ్రోన్ దాడిలో ఆరాంకో చమురు కేంద్రాల్లో భారీగా మంటలు వ్యాపించాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దాడి వల్ల చమురు శుద్ధి ప్రక్రియ భారీగా నిలిచిపోయింది. ఫలితంగా చమురు ధరలు 20 శాతానికి పైగా పెరిగాయి.