బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా జరిపిన దాడితో ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఇరాన్లో రెండో అత్యంత శక్తిమంతమైన నేత ఖాసీంసులేమానీ మరణించారు. ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ)లోని అత్యంత శక్తిమంతమైన కుర్ద్ ఫోర్స్‌కు జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఆర్‌జీసీ గురించి చెప్పే కథనాల్లో ఆయన చిత్రాన్నే వాడతారు.
సులేమానీనేతృత్వం వహిస్తున్న కుర్ద్ ఫోర్స్ ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాలను సాగిస్తుంటుంది. ముఖ్యంగా లెబనాన్‌లో హిజ్బుల్లా పక్షాలకు బలమైన అండ. దీని అండతోనే హిజ్బుల్లా లెబనాన్‌లో పాలన చేస్తోంది. ఇక ఇరాక్‌లో కూడా కుర్దులు, షియాలకు అనుకూలంగా ఈ దళం పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలు.. వ్యూహాలు.. దాడులు.. ప్రతిదాడులు మొత్తంసులేమానీ కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల సమయంలో కూడా సులేమానీ నేరుగా అమెరికాపై బెదిరింపులకు దిగారు. ఆయన ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమైనీకి మాత్రం జవాబుదారీగా ఉంటారు.
ఎవరీసులేమానీ..?
కుర్ద్ ఫోర్స్ జనరల్ ఖాసీంసులేమానీ ఒక పేద కుటుంబంలో 1957లో జన్మించారు. ఆయన కుటుంబం ఇరాన్‌లోని రాబోర్ ప్రాంతంలో నివసించేది. ఆ ప్రాంతంలో ఆప్రియోకాట్, వాల్‌నట్, పీచ్ తోటలు విస్తారంగా ఉండేవి. ఇక్కడ ఎంతో మంది యువకులు ఇరాన్ సైన్యంలో పనిచేసేవారు. సులేమానీ 13 ఏళ్ల వయస్సులో ఒక నిర్మాణ రంగ సంస్థలో కార్మికుడిగా పనిచేశారు. ఆ తర్వాత కెర్మాన్ వాటర్ సంస్థలో పనిచేశారు. అదే సమయంలో జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేసేవారు. ఖాళీ సమయాల్లో ఖమైనీలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కరాటేలో బ్లాక్‌బెల్ట్ కూడా అందుకొన్నారు.
1979లో ఇస్లామిక్ రివల్యూషన్ తర్వాత ఆయన ఐఆర్‌జీసీలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలైంది. ఇది దాదాపు 8 ఏళ్లపాటు సాగింది. ఈ యుద్ధంలో ఇరాన్ టీనేజర్లను కూడా సైనికులుగా మార్చి పంపించింది. ఈ క్రమంలో ఇరాక్ చేసిన రసాయన ఆయుధ దాడిలోసులేమానీ బృందం చిక్కుకొంది. దీని నుంచి ఆయన బయటపడ్డారు. ఈ యుద్ధం తర్వాత నాటి ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీతో విభేదాల కారణంగా ఆయన 1989-97 వరకు అజ్ఞాతవాసంలో ఉండిపోయారు. రఫ్సంజానీ పదవిని వీడాక కుర్ద్ ఫోర్స్‌కు కమాండర్‌గా ఎదిగారు. సులేమానీ కుమార్తె వివాహానికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమైనీ హాజరైన తర్వాత ఆయన పరపతి పెరిగిపోయింది.
ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా టార్గెట్‌లోకి..
2003లో అమెరికా సేనలు ఇరాక్‌ను ఆక్రమించాకసులేమానీపై దృష్టి సారించాయి. వికీలీక్స్ కథనాల ప్రకారం 2009లో బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై రాకెట్ దాడులు ఆపేందుకు అమెరికా దౌత్యబృందాలు సులేమానీతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించాయి. ఒకసారి ఇరాక్ ప్రధానికి జలాల్ తల్బాని ఒక సందేశం పంపించారు. దీనిని ఆయన అమెరికా అధికారులకు చూపించారు. ఇరాక్‌లో వందల మంది ఏజెంట్లు ఉన్న విషయాన్ని సులేమానీ అంగీకరించారు. కానీ, ‘‘ఖమైనీ సమాధి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఒక్క తూటాను కూడా అమెరికాకు వ్యతిరేకంగా వాడమని చెప్పలేదు’’ అని పేర్కొన్నారు.
ఆ తర్వాత తల్బాని కార్యాలయంలోనే అమెరికా జనరల్స్‌ను ఆయన కలుసుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, వీటిని అమెరికా అధికారులు కొట్టిపారేశారు.
ఇరాక్‌లోని కర్బల ప్రాంతంలో ఐదుగురు అమెరికా సైనికులను బాంబుపేల్చి చంపినప్పుడు మారోసారిసులేమానీ పేరు తెరపైకి వచ్చింది. ఇరాక్‌లోని షియా మిలిటెంట్లకు ఐఈడీ బాంబులను తయారీ నేర్పిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అమెరికా జనరల్‌కే మెసేజ్..
2007లోసులేమానీ నాటి అమెరికా జనరల్ డేవిడ్ పీట్రస్‌కు ఒక సందేశం నేరుగా పంపారు. దీనిలో ఇరాన్ శక్తిని వెల్లడించే ప్రయత్నం చేశారు.
‘"జనరల్ పీట్రస్ నీకు తెలుసు నేను ఖాసీం సులేమానీ అని. ఇరాక్, లెబనాన్, గాజా, అఫ్గానిస్థాన్‌లో ఇరాన్ పాలసీని నియంత్రిస్తున్నాను. ప్రస్తుతం ఇరాక్‌లోని ఇరాన్ రాయబారి కుర్ద్ ఫోర్స్ సభ్యుడే. అతని తర్వాత వచ్చేది కుర్ద్ ఫోర్స్ సభ్యుడే"
-పీట్రస్‌కు సులేమానీ సందేశం
2007లోనేసులేమానీపై ఐరాస ఆంక్షలు విధించింది. 2011లో సౌదీ దౌత్య సిబ్బంది హత్య కోసం మెక్సికన్ మాదక ద్రవ్యాల స్మగ్లర్ సాయం తీసుకొన్నట్లు సులేమానీపై ఆరోపణలు వచ్చాయి.