ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. అయితే కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్నారు సౌదీ అధికారులు. ఇప్పటికే ఐసోలేషన్ పూర్తి చేసుకున్న యాత్రికులు.. మాస్కులు ధరించి చిన్న చిన్న బృందాలుగా పవిత్ర మక్కాను సందర్శించుకుంటున్నారు.
సాధారణంగా 40 రోజులపాటు సాగే ఈ యాత్రకు ఎంతో విశిష్టత ఉంది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం చివరిదైన 12వ నెలలో చేసే మక్కా యాత్రను హజ్ అంటారు. 1,400 ఏళ్ల క్రితం మహ్మద్ ప్రవక్త నడిచిన మార్గమని విశ్వసిస్తారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒకసారైనా హజ్ యాత్ర చేయాలన్నది నిర్దేశం.
భౌతిక దూరం..
కరోనా నేపథ్యంలో ఈసారి యాత్రను 5 రోజులకు కుదించారు. సాధారణంగా హజ్ యాత్రలో సాధారణంగా లక్షల మంది పాల్గొంటారు. కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను సౌదీ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది.
కరోనా వ్యాప్తిని నివారించేందుకు యాత్రికులను 20 మందితో కూడిన చిన్న బృందాలుగా అనుమతి ఇస్తున్నారు. ప్రార్థనల సమయంలో ఒకరి నుంచి మరొకరు దూరాన్ని పాటించాలి. ముందుగానే ప్యాక్ చేసిన భోజనాన్ని అందిస్తున్నారు. యాత్రికులకు సంబంధించి ప్రయాణ, బస, భోజన సదుపాయం, వైద్య ఖర్చులు సౌదీ ప్రభుత్వమే భరిస్తోంది.
వీరికే అనుమతి..
అయితే విదేశాల నుంచి యాత్రికులకు సౌదీ అనుమతి ఇవ్వలేదు. చరిత్రలో ఇలా జరగటం ఇదే మొదటిసారి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారిలో 20- 50 మధ్య వయసు ఉన్నవారికే అధికారులు ప్రాధాన్యం ఇచ్చారు. కరోనా లక్షణాలు, ఇతర అనారోగ్యం లేనివారు, ఇంతకుముందు యాత్ర చేయనివారికి అవకాశం కల్పించారు.
యాత్రకు ఎంపికైన వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్లో ఉంచారు. యాత్రికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు వారికి రిస్ట్ బ్యాండ్లను ఇచ్చారు. మక్కాకు చేరుకున్న ప్రతి యాత్రికుడు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. యాత్ర ముగిసిన తర్వాత కూడా వారంరోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి.
హజ్ యాత్ర కవరేజీకి అంతర్జాతీయ మీడియాకు సౌదీ ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఆ దేశానికి చెందిన ప్రభుత్వ ఛానల్ మక్కా దర్శనం దృశ్యాలను ప్రసారం చేసింది. ఇందులో యాత్రికులు చాలా పరిమిత సంఖ్యలో కనిపిస్తున్నారు.