అమెరికా, తాలిబన్ల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. దోహా వేదికగా ఖతార్ అధికారుల సమక్షంలో అమెరికా, తాలిబన్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
దీని ప్రకారం ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడి ఉంటే అఫ్గానిస్థాన్ నుంచి 14 నెలలలోపు అమెరికా తన సేనలను ఉపసంహరించుకుంటుంది. మార్చి 10 నుంచి శాంతి చర్చలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తాలిబన్లకు పలు విజ్ఞప్తులు చేశారు పాంపియో.
"అమెరికా, తాలిబన్లు దశాబ్దాలుగా అనిశ్చితి, అపనమ్మకంతో ఉన్నాయి. గతంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. శాంతి ప్రక్రియకు తాలిబన్లు ఆసక్తి చూపటం.. ఆల్‌ఖైదాతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తెంచుకోవటానికి సిద్ధమయ్యాయి. మిలిటరీ చర్యతో శాంతి ఏర్పడదని వాళ్లు గుర్తించారు. మొదటగా మీ హామీలకు కట్టుబడి ఉండండి. ఆల్‌ఖైదా, ఇతర ఉగ్రసంస్థలతో సంబంధాలు తెంచుకోండి. ఐసిస్‌ను ఓడించేందుకు పోరాడుతూనే ఉండండి."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి