అఫ్గానిస్థాన్లో ఉన్న అమెరికా, నాటో తుది దశ బలగాల ఉపసంహరణ శనివారం అధికారికంగా ప్రారంభమైంది. అమెరికాకు చెందిన సుమారు 3,500 మంది సైనికులు సహా నాటోకు చెందిన 7000 మంది అఫ్గానిస్థాన్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం.
ఈ బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఏప్రిల్ నాటికే పూర్తి కావాల్సి ఉన్నా.. దానిని అమెరికా అధ్యక్షుడు బైడెన్ వాయిదా వేశారు.
భద్రతకు ముప్పు?
బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి పూర్తికానుంది. అయితే ఈ క్రమంలో తాలిబన్లు.. బలగాలపై దాడి చేసే అవకాశం ఉందని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా, నాటో బలగాలపై ఎలాంటి దాడి జరపమని తాలిబన్లు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఉపసంహరణపై అమెరికా తొలుత ప్రకటించిన తుది గడువును ఉల్లంఘించడం ద్వారా తమకు ప్రతిదాడి చేసే అవకాశం కల్పించిందని తాలిబన్ భావిస్తోంది. ఈ విషయాన్ని తాలిబన్ సైనిక ప్రతినిధి జబీనుల్లా ముజాహిద్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దేశ పరిస్థితులు, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.