ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీం సులేమానీ హత్యతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఈ రోజు 22 రాకెట్లతో దాడి చేసింది.
ఈ ప్రతీకార దాడితో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు మరింత దట్టంగా ఆవరించాయి. అయితే ఈ దాడిని ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. జరిగిన దాడిని పూర్తిగా అధ్యయనం చేసి రేపు భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడుతానని ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ స్పందన తర్వాత.. ఎదురుదాడికి పాల్పడితే మరిన్ని అమెరికా స్థావరాలపై దాడులు చేపడుతామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ పరిస్థితులపై జోర్డాన్, లిబియా, మాల్టాలో భారత రాయబారిగా పనిచేసిన అనిల్ త్రిగుణయత్ తన అభిప్రాయాన్ని తెలిపారు. అణు ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలిగినప్పటి తర్వాతనే అమెరికా-ఇరాన్ మధ్య వాతావరణం వేడేక్కిందని చెబుతున్నారు.
పునాది అక్కడే..
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా.. ఇరాన్‌తో సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ) పేరుతో చారిత్రక అణు ఒప్పందం కుదుర్చుకుని గొప్ప విజయాన్ని సాధించారు. గతంలోని ఆంక్షలను సడలిస్తూ ఇరాన్ అణు అవసరాలను తీర్చే విధంగా ఈ ఒప్పందం జరిగింది. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ ఒప్పందం నుంచి వైదొలిగారు. ఇక్కడే రెండు దేశాల మధ్య అంతరానికి పునాది పడింది.
ట్రంప్ వ్యూహాలు..
అణు ఒప్పందం నుంచి వైదొలిగనప్పటి తర్వాత ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు ట్రంప్ రాక్షస ప్రయత్నమే చేశారు. వివిధ వ్యూహాలు, విస్తృత ఆంక్షలతో ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఇరాన్‌కు సంబంధించి అంతర్గత, విదేశీ వివాదాలను అనుకూలంగా మార్చుకుంది అమెరికా.
షియా-సున్నీ వర్గాల మధ్య ఇప్పటికే తీవ్రంగా ఉన్న అంతరాన్ని అస్త్రంగా వాడుకున్నారు. అస్థిత్వ పోరులో సౌదీ అరేబియాతో ప్రత్యక్షంగా , ఇజ్రాయెల్‌తో పరోక్షంగా ఉన్న ఇరాన్ వైరాన్ని మరో ఆయుధంగా మలుచుకుంది అమెరికా.
కుష్నర్ నేతృత్వంలో...
ట్రంప్ సలహాదారు జారెడ్ కుష్నర్ నేతృత్వంలో ఇజ్రాయెల్‌కు గల్ఫ్ దేశాలతో సయోధ్య ఏర్పడినా.. ఇరాన్‌తో మాత్రం వైరం మరింత ముదిరింది. ఇది పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిరతకు దారి తీసింది. ఈ మార్పు ఇరాన్ ప్రభావం స్పష్టంగా కనిపించే దేశాల్లో ఎన్నో వివాదాలకు కారణమైంది.
ఈ పరిణామాలతో లిబియా, యెమెన్, ఇరాక్, సిరియా, గాజా, లెబనాన్ తదితర దేశాలు అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా మారాయి. మరోవైపు ఇరాక్‌లోని రాజ్యేతర శక్తులైన హిజ్బుల్లా, హమాస్, హౌతీస్, షియా మిలిషియా.. ఇరాన్‌కు దగ్గరయ్యాయి.
ఈ సంఘటనలు పశ్చిమాసియా ప్రాంతంలో ప్రతికూల వాతావరణానికి దారి తీసింది. చమురు సరఫరా, వాణిజ్యానికి కీలకమైన హొర్మూజ్ జలసంధిలో ఎన్నో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అమెరికా డ్రోన్ల కూల్చివేత, వాణిజ్య ఓడలు, సౌదీ చమురు కేంద్రాలపై దాడులు జరిగాయి. ఆ సమయంలో ప్రతిదాడులు జరగకపోవటం ఒకరకంగా అదృష్టంగానే భావించాలి.
హొర్మూజ్‌లో వరుస పరిణామాల తర్వాత కొంత నిశబ్దం ఆవిరించింది. రెండు దేశాల మధ్య సయోధ్య కోసం వివిధ దేశాల కృషితో మధ్యమార్గం ఏర్పడుతున్నట్లు కనిపించింది. ఈ సమయంలోనే అమెరికా కాంట్రాక్టర్‌ను మిలీషియా గ్రూపు చంపటం.. వెంటనే సులేమానీని మట్టుబెట్టాలని ట్రంప్ ఆదేశాలు ఇవ్వటం.. అంచనాలను తలకిందులు చేసింది.