యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొట్టమొదటి అంగారక యాత్ర సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది. జపాన్‌లోని తనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి హెచ్-11ఏ వాహక నౌక ఎమిరేట్స్ మార్స్ మిషన్(ఎమిరేట్స్ మార్స్ మిషన్)కు చెందిన హోప్ అంతరిక్ష నౌకను మోసుకెళుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ యాత్ర 200 రోజుల పాటు సాగనున్నట్లు యూఏఈ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.
సుదీర్ఘంగా అధ్యయనం...
అంగారక గ్రహం మీద వాతావరణ పరిస్థితుల అధ్యయనమే లక్ష్యంగా ఈ మిషన్‌ను చేపట్టారు. దాదాపు 687 రోజుల పాటు అంగారక గ్రహంపై దీని అధ్యయనం సాగనుంది. రోజువారీ వాతావరణంతో పాటు వివిధ రుతువుల్లో అక్కడి పరిస్థితులు ఎలా మార్పు చెందుతున్నాయన్న విషయంపై దీని పరిశోధన సాగనుంది. ముఖ్యంగా ఉపరితంలో గూడు కట్టుకుని ఉన్న ధూళి కణాల లక్షణాలను ఇది పరిశీలించనుంది. ఈ కణాలే అక్కడి వాతావరణ, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా అక్కడి వాతావరణ మార్పుల గుట్టు తెలిసే అవకాశం ఉంది. అలాగే వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు ఎలా ఉన్నాయన్న దానిపై కూడా ఈ మిషన్ సమాచారం అందించనుంది. వాస్తవానికి ఈ ప్రయోగం బుధవారమే జరగాల్సి ఉండగా.. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆలస్యమైంది.