UN Yemen news: దక్షిణ యెమెన్‌లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి సిబ్బందిని అల్‌ఖైదా ఉగ్రవాదులు అపహరించినట్లు యెమెన్ అధికారులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం వారిని ఎత్తుకెళ్లి, గుర్తుతెలియని ప్రదేశానికి తరలించినట్లు వెల్లడించారు. వారిలో నలుగురు యెమెన్ దేశస్థులు, ఒక విదేశీయుడు ఉన్నారు. దీని గురించి తమకు తెలుసని, పలు కారణాల వల్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని యూఎన్ అధికార ప్రతినిధి స్టెఫనీ డుజారిక్ అన్నారు.
అయితే అపహరణకు గురైనవారిని సురక్షితంగా విడిపించేందుకు కిడ్నాపర్లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రైబల్ నేతలు తెలిపారు. వారు డబ్బులతో పాటు యెమెన్‌లో బందీలుగా ఉన్న ఉగ్రవాదులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. యూఎన్ సిబ్బందిని విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం కూడా తెలిపింది.
కిడ్నాప్‌లు సాధారణమే!
యెమెన్‌లో అపహరణలు తరచుగా జరుగుతుంటాయి. ఇక్కడ సాయుధ గిరిజనులు, అల్‌ఖైదాతో సంబంధమున్న ఉగ్రవాదులు.. డబ్బులు, బందీలను విడిపించుకునేందుకు కిడ్నాప్‌లకు పాల్పడుతుంటారు. వీరు అమెరికాలోనూ దాడులకు పాల్పడుతుంటారు.