Turkey Inflation crisis: టర్కీలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరింది. వార్షిక ద్రవ్యోల్బణం రేటు 19 ఏళ్ల రికార్డును చెరిపేస్తూ డిసెంబర్ నాటికి 36.08 శాతానికి ఎగబాకింది. డిసెంబర్లో వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే 13.58 శాతం మేర పెరిగిందని టర్కీ గణాంక సంస్థ ప్రకటించింది. ఆహార ధరల్లో వార్షిక పెరుగుదల 43.8 శాతంగా ఉందని తెలిపింది.
Turkey original inflation rate 2021
అయితే, స్వతంత్రంగా పనిచేసే 'ద్రవ్యోల్బణ పరిశోధన బృందం' మాత్రం దేశంలో ద్రవ్యోల్బణం 83 శాతానికి చేరిందని పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ అంతకుముందు నెలతో పోలిస్తే డిసెంబర్లో 19.35 శాతం పెరిగిందని వెల్లడించింది.
కరెన్సీ పతనం
Turkey currency crisis: ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినా.. 2002 సెప్టెంబర్ తర్వాత అత్యధిక వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఇదే. ఓ వైపు ధరలు భారీగా పెరుగుతుంటే.. టర్కీ కరెన్సీ లిరా.. రోజురోజుకూ పతనమవుతోంది. అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ ఒత్తిడితో కీలక వడ్డీ రేట్లపై టర్కీ సెంట్రల్ బ్యాంకు కోతలు విధించడం వల్ల.. కరెన్సీ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. తద్వారా దిగుమతులు కష్టతరమయ్యాయి. దీంతో దేశంలో ప్రతి వస్తువు ధర భారీగా పెరిగింది. ఫలితంగా దేశంలోని ప్రజల కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తోంది.