'శునకాలకు విశ్వాసం ఎక్కువే..' ఈ మాట రోజూ వింటూనే ఉంటాం. దీనిని రుజువు చేస్తూ ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా టర్కీలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అనారోగ్యం కారణంగా యజమానిని అంబులెన్స్‌లో తరలిస్తున్న సమయంలో.. దాని వెంటే పరిగెత్తింది ఓ శునకం. యజమాని కోసం పరితపించిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదీ జరిగింది..
టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఓ మహిళ అనారోగ్యం బారినపడ్డారు. ఇన్నిరోజులు ఇంట్లో చికిత్స తీసుకున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చడం కోసం అంబులెన్సు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అంబులెన్సులోకి ఎక్కేందుకు గోల్డెన్ రిట్రీవర్ (శునకం జాతి) ప్రయత్నించగా, పలు కారణాలతో దానిని సిబ్బంది అనుమతించలేదు.
అయితే, యజమానికి ఏమవుతుందోననే భయంతో అంబులెన్సు వెంటే పరుగుపెట్టింది గోల్డెన్ రిట్రీవర్. ఆమెను ఆస్పత్రికి లోపలికి తీసుకెళ్లాక.. ప్రవేశ ద్వారం దగ్గరే ఓపిగ్గా ఎదురుచూసింది. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం, శునకం చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ఇదీ చూడండి:యజమాని మరణం తట్టుకోలేక శునకం కన్నుమూత