అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వల్ల విదేశాల్లో ఉన్న అఫ్గాన్లు స్వదేశానికి వెళ్లాలంటే వణికిపోతున్నారు. పౌరులు సహా, అమెరికా సాయంతో ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న అఫ్గాన్ పైలట్లు తమను తిరిగి స్వదేశానికి పంపుతారేమోనని భయపడిపోతున్నారు. ఎక్కువ కాలం తమ దేశంలో ఉండడం కుదురదంటూ ఉజ్బెకిస్థాన్ స్పష్టం చేయడంతో వారికి ప్రాణభయం పట్టుకుంది. ఉజ్బెకిస్థాన్ నుంచి తమను వెనక్కి పంపితే తమను కచ్చితంగా చంపేస్తారని ఓ పైలట్ కన్నీరు పెట్టుకున్నాడు. తమను మరికొంత కాలం ఇక్కడే ఉంచాలన్న పైలట్ల విజ్ఞప్తిపై ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం స్పందించలేదు.
అక్కడికి వెళితే చావు తప్పదు..
అఫ్గానిస్థాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని తాలిబన్లు వెల్లడించారు. దేశాన్ని ఓ కౌన్సిల్ ద్వారా పరిపాలించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాలిబన్లు అఫ్గాన్ పైలట్లు, సైనికులను కూడా సంప్రదించి వారిని విధుల్లో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ, తాలిబన్ బలగాలను కలిపి ఓ సైన్యం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తమను తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారని.. అక్కడికి వెళితే తమను చంపేస్తారని అఫ్గాన్ పైలట్లు ఆందోళనకు గురవుతున్నారు. ఆంగ్ల వార్తాసంస్థతో ఓ పైలట్ మాట్లాడుతూ 'మమ్మల్ని తిరిగి పంపిస్తే.. 100శాతం వారు మమ్మల్ని చంపేస్తారు' అని పేర్కొన్నారు.