2020లో కరోనా సృష్టించిన విలయ తాండవాన్ని చవిచూచిన యావత్ ప్రపంచం.. ఆ మహమ్మారిపై పోరుకు టీకా అనే ఆయుధాన్ని తీసుకొస్తుందనే ఆశతో 2021కి..ఘనంగా స్వాగతం పలికింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. తొలుత న్యూజిలాండ్‌ను.. కొత్త సంవత్సరాది పలకరించగా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా, భారత్ సహా పలు దేశాలు.. 2021లోకి అడుగుపెట్టాయి. మిగిలిన దేశాల్లో ప్రజలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు.
2021 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్ నగరం మెరిసిపోయింది. కేరింతలు కొడుతూ, బాణసంచా కాల్చి ఆక్లాండ్ నగర వాసులు సంబరాలు జరుపుకున్నారు. ప్రఖ్యాత స్కైటవర్పై బాణాసంచా పేలుళ్లు ఆకర్షణగా నిలిచాయి.
ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీహార్బర్కు ఆస్ట్రేలియన్లు చేరుకుని.. నూతన ఏడాదికి ఆహ్వానం పలికారు. హార్బర్ వంతెనపై రంగురంగుల బాణాసంచా వెలుగులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఉత్తర కొరియా
ఉత్తర కొరియా రాజధాని యోంగ్ యాంగ్ లోని ప్రఖ్యాత పిరమిడ్ భవనం బాణాసంచా వెలుగులతో ధగధగలాడింది.
జపాన్
జపాన్‌లోను నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజధాని నగరం టోక్యోలోని సెన్సోజీ ఆలయంలో సంప్రదాయబద్దంగా గంట మోగించి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
తైవాన్
తైవాన్ లోనూ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా వెలుగులు మిరుమిట్లు గొలిపాయి.