ప్రపంచవ్యాప్తంగా.. కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 95 దేశాలలో విస్తరించిన ఈ వైరస్ ధాటికి.. 3,595 మంది బలయ్యారు. మరో 1,05,836 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.
ఇప్పటివరకు ఒక్క చైనాలోనే 3,097మంది మరణించగా.. మొత్తం బాధితుల సంఖ్య 80,965కు చేరింది. చైనా వెలుపలి దేశాల్లో.. వైరస్ సోకి 498 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 25,141 కు పెరిగింది.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలు:
దేశం | మృతులు | వైరస్ కేసులు |
చైనా | 3,097 | 80,965 |
ఇటలీ | 233 | 5,883 |
ఇరాన్ | 145 | 5,823 |
దక్షిణకొరియా | 48 | 7,134 |
ఫ్రాన్స్ | 16 | 949 |
- ఆసియాలో 89,525 కరోనా కేసుల్లో.. 3,162 మంది మరణించారు.
- ఐరోపాలో 9,655 కేసులు నమోదు కాగా.. 263 మంది ప్రాణాలు కోల్పోయారు.
- పశ్చిమాసియాలో 6,158 మందికి కరోనా సోకగా.. 149 మంది చనిపోయారు.
- అమెరికా, కెనడా దేశాలలో 270 కేసుల్లో.. 16 మంది మృతిచెందారు.
- ఓసియానా(ఆస్ట్రేలియా తదితర) ప్రాంతంలో 83 మంది వైరస్ బారినపడగా.. ముగ్గురు బలయ్యారు.
- లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో 83 కేసులకు గానూ.. ఒకరు మరణించారు.
ఇరాన్లో రికార్డు మరణాలు
ఇరాన్లో ఒక్కరోజే 49 మందిని బలిగొంది కరోనా మహమ్మారి. 24 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యలో ఇదే అత్యధికం. దీంతో.. ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 194కు చేరింది. దేశంలోని 31 రాష్ట్రాలకు విస్తరించిన ఈ మహమ్మారి ధాటికి.. 6,566 కేసులు నమోదయ్యాయి.