కొంతకాలంగా కతర్‌లో తలదాచుకుంటున్న తాలిబన్ రాజకీయ, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్.. అఫ్గాన్ తాజా పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ క్రియాశీలకంగా మారాడు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన ఆయన దోహా శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సందర్భంగా పలు దేశాల ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపాడు.
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వెనక్కు మళ్లిన తర్వాత.. తాలిబన్లు ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం వెనుక బరాదర్ వ్యూహాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్ తాలిబన్లపరం కావడం వల్ల ఆయన మంగళవారం కతర్ నుంచి అఫ్గాన్‌కు బయల్దేరినట్టు తెలిసింది. అంతకుముందు కతర్ విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థనీ, బరాదర్ మధ్య కీలక భేటీ జరిగింది. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా రాజకీయ, భద్రతా పరిస్థితులపై వారు చర్చించారు. తాలిబన్లకు సవాలు కానున్న పలు అంశాలను సమర్థంగా ఎదుర్కోవడంపై వారు చర్చించినట్టు సమాచారం. ముఖ్యంగా- అధికార మార్పిడిని శాంతియుతంగా పూర్తిచేయడం; ప్రజలకు రక్షణ, భరోసా కల్పించడం; కొత్త ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించేలా వ్యవహరించడం వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.