తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న పంజ్‌షేర్ దళాలకు(Panjshir resistance forces) పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. తాలిబన్ల కాల్పుల్లో పంజ్‌షేర్(Taliban Panjshir దళాల ప్రతినిధి ఫాహిమ్ దష్టీ ఆదివారం మృతి చెందినట్లు 'టోలో' తన వార్త కథనంలో వెలువరించింది. జమైత్-ఈ-ఇస్లామీ పార్టీతో పాటు అఫ్గాన్ జర్నలిస్టుల సమాఖ్యలో దష్టీ సభ్యుడిగా ఉన్నారు. ఈ పరిణామాల అనంతరం పంజ్‌షేర్ ప్రాంతం తాలిబన్ల వశమైందనే అనిపిస్తోంది.
కాల్పుల విరమణకు ఓకే..
తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని పంజ్‌షేర్(Panjshir Valley) దళాల నాయకుడు అహ్మద్ మసూద్ తెలిపారు. తాలిబన్లు తమ ప్రావిన్సును వీడినట్లయితే.. చర్చలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తాలిబన్లతో మొదలైన భేదాభిప్రాయాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. తమ డిమాండ్‌ను మానవతా దృక్పథంతో తాలిబన్లు పరిగణలోకి తీసుకుంటారని విశ్వసిస్తున్నట్లు ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు.
పంజ్‌షేర్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి తాలిబన్లు ఫైటర్లను రంగంలోకి దించారు. ఈ ప్రాంతం తమ ఆధీనంలోకి వచ్చిందని శుక్రవారం ప్రకటించారు. కానీ ఈ ప్రకటనలను పంజ్‌షేర్ పోరాట దళాలు ఖండించాయి. ఈ క్రమంలో శనివారం జరిగిన కాల్పుల్లో 700 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షేర్ దళాలు మట్టుబెట్టాయని 'స్పుత్నిక్' మీడియా తన కథనంలో పేర్కొంది. ఇదే విషయాన్ని పంజ్‌షేర్ తిరుగుబాటు దళ ప్రతినిధి ఫహీమ్ దష్టీ ట్విట్టర్ వేదికగా తెలిపారని చెప్పింది. కానీ ఫాహిమ్ దష్టీ మృతి అనంతరం తాజా పరిణామాలు జరిగాయి.