అమెరికా హడావుడిగా వైదొలగడం.. అఫ్గానిస్థాన్ సేన చేతులెత్తేయడంతో తాలిబన్లు మళ్లీ తెరపైకి వచ్చారు. అఫ్గాన్‌ను గుప్పెట్లో బంధించారు. అయితే ఒకప్పటితో పోలిస్తే నేడు ఆ దేశం తీరు భిన్నం. అమెరికా సౌజన్యంతో కొన్నేళ్లుగా అక్కడ సైనిక మౌలిక వసతులు భారీగా సమకూరాయి. బోలెడు ఆయుధాలు, మందుగుండు సామగ్రి పోగుపడి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అప్పనంగా తాలిబన్ల పరమయ్యాయి. ఆటవిక మూకను తలపించే ఈ ముఠాకు ఇప్పుడు తొలిసారిగా వైమానిక దళం కూడా సమకూరింది. ఇది వారు కలలోనూ ఊహించని పరిణామం. అఫ్గాన్‌లో భద్రతకు పూచీకత్తు వహించేలా అక్కడి పౌర ప్రభుత్వానికి తోడ్పాటు అందించడానికి అమెరికా.. ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు 89 బిలియన్ డాలర్లను వెచ్చించింది. అయితే అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో.. ఆ భారీ పెట్టుబడులతో ఒనగూరిన ప్రయోజనాలన్నీ తాలిబన్ల చేతిలోకి జారిపోతాయన్నది సుస్పష్టం. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్యలో.. అఫ్గాన్ జాతీయ రక్షణ, భద్రతా దళాల (ఏఎన్‌డీఎస్‌ఎఫ్)కు పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామగ్రిని అమెరికా అందించింది.
వాటిలో ముఖ్య ఆయుధాలివీ..
- ఏ-29 తేలికపాటి పోరాట విమానాలు: 6
- వేగంగా కదిలే బహుళ ప్రయోజన 'హమ్వీ' వాహనాలు: 174
- 2.75 అంగుళాల హై ఎక్స్‌ప్లోజివ్ రాకెట్లు: 10వేలు (గగనతలం నుంచి భూతలంపై దాడికి)
- 40 ఎంఎం హై ఎక్స్‌ప్లోజివ్ తూటాలు: 60వేలు
- పాయింట్ 50 క్యాలిబర్ తూటాలు: 9 లక్షలు
- 62 ఎంఎం తూటాలు: 20 లక్షలు
సైనిక స్థావరాలు
అమెరికా ఇటీవలే 11 స్థావరాలు, సైనిక ప్రాంగణాలను అఫ్గాన్ సైన్యానికి అప్పగించింది. వీటిలో న్యూ ఆంటోనిక్, కాందహార్ వైమానిక క్షేత్రం, క్యాంప్ మోర్‌హెడ్, న్యూ కాబుల్ కాంప్లెక్స్, బ్లాక్‌హౌస్, క్యాంప్ స్టీవెన్‌సన్, క్యాంప్ డ్వైర్, క్యాంప్ లింకన్, క్యాంప్ ఎరీనా, బగ్రామ్ వైమానిక స్థావరం, రిజల్యూట్ సపోర్ట్ హెడ్‌క్వార్టర్స్ ఉన్నాయి.