15 నిమిషాల్లో మనం ఎన్ని దేశాల పేర్లను చెప్పగలం.. మహా అంటే 10 లేదా 20.. మరి వాటి రాజధానుల పేర్లు! కరెన్సీ వివరాలు! అమ్మో కష్టమే అంటారా? కానీ దుబాయ్‌లో నివసించే భారత సంతతి చిన్నారి 'సారా చిప్పా' మాత్రం ఏకంగా 195 దేశాలు-రాజధానులు-కరెన్సీల పేర్లను అలవోకగా చెప్పేస్తూ వావ్ అనిపిస్తోంది. ఇంతకుముందు వరకు ఈ రికార్డు.. దేశాలు, రాజధానులను గుర్తుపెట్టుకోవడంపైనే ఉండగా.. కొత్తగా కరెన్సీ పేర్లను సైతం చెప్పి సరికొత్త రికార్డును ఆవిష్కరించింది సారా. అంతేగాక ఈ విభాగంలో ప్రపంచ రికార్డు సాధించిన మొట్టమొదటి వ్యక్తి సారానే కావడం విశేషం. మే 2న యూఏఈలో జరిగిన ఓ వర్చువల్ లైవ్ ఈవెంట్లో ఆమె ఈ ఫీట్ సాధించింది.
585 అంశాలు..
ఈ రికార్డు సాధనలో సింగపూర్‌కు చెందిన 'బ్రెయిన్ రైమ్ కాగ్నిటివ్ సొల్యూషన్స్' వ్యవస్థాపకుడు సుశాంత్ మిజోరేకర్ సారాకు శిక్షణ, సహాకారం అందించారు. జ్ఞాపకశక్తికి సంబంధించి.. సృజనాత్మక నైపుణ్యాలు, ఇంటెలిజెన్స్ టెక్నిక్‌ల ద్వారా ఎక్కువ పేర్లను గుర్తుంచుకునేలా శిక్షణ ఇచ్చారు. మొదట్లో 585 అంశాలను ప్రాక్టీస్ చేయడానికి సారాకు సుమారు 90నిమిషాలు పట్టేది. అయితే నిరంతర శిక్షణతో ఇప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే చెప్పగలుగుతోంది.
లాకౌడౌన్ సమయంలో సారా 'మెమరీ టెక్నిక్స్' తరగతులకు హాజరైందని.. ప్రపంచ రికార్డ్ సాధించేందుకు ముందస్తు ప్రణాళికలేవీ చేసుకోలేదని ఆమె తండ్రి వివరించారు.