Deltacron variant news: సైప్రస్‌లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో ఈ వేరియంట్ ఏర్పడింది. శాస్త్రీయ పేరును ఇంకా ఖరారు చేయని ఈ కొత్త వేరియంట్‌ను 'డెల్టాక్రాన్'గా పరిగణిస్తున్నారు. అయితే, ఈ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
Deltacron emerges in Cyprus:
సైప్రస్‌లో సేకరించిన 25 నమూనాల్లో పది ఒమిక్రాన్ మ్యుటేషన్లు కనిపించినట్లు స్థానిక వార్తా కథనాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల నుంచి 11 నమూనాలు, సాధారణ పౌరుల నుంచి 14 నమూనాలు పరీక్షించినట్లు తెలిపాయి.
New Coronavirus variant
ఆస్పత్రిలో చేరిన బాధితుల నమూనాల్లో మ్యుటేషన్ల స్థాయి ఎక్కువగా ఉందని సైప్రస్ విశ్వవిద్యాలయ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్ట్రికిస్ తెలిపారు. అయితే, కొత్త వేరియంట్ వల్ల ఆస్పత్రి చేరికలు పెరుగుతాయని చెప్పడానికి ఆధారాలు లేవని చెప్పారు. కొత్త వేరియంట్లో డెల్టా జన్యు నేపథ్యం, ఒమిక్రాన్ మ్యుటేషన్లు ఉన్నాయని వివరించారు.
భయం వద్దు..
మరోవైపు, సైప్రస్ వైద్య శాఖ మంత్రి మిషలిస్ హజిపండెలాస్ సైతం కొత్త వేరియంట్‌పై భయం అక్కర్లేదని అన్నారు. కొత్త వేరియంట్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవిజ్ఞానంతో సైప్రస్ శాస్త్రవేత్తలు వేరియంట్‌ను గుర్తించగలగడం తమకు గర్వకారణమని అన్నారు.
యూకేలో 1.5 లక్షల మరణాలు
మరోవైపు, కరోనా విషయంలో బ్రిటన్ మరో విషాదకర మైలురాయిని చేరుకుంది. వైరస్ బారిన పడి మరణించినవారి సంఖ్య లక్షా 50 వేలు దాటింది. శనివారం నమోదైన 313 మరణాలతో ఈ మైలురాయిని చేరింది బ్రిటన్. కరోనా మహమ్మారి పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించిందని, ప్రజలందరూ వ్యాక్సిన్ వేయించుకొని మాస్కులు ధరించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కొవిడ్ సమయంలో నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) అందిస్తున్న నిరంతర సేవలకు కృతజ్ఞతలు చెప్పారు.
టీకా తప్పనిసరి!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, సినిమా థియేటర్లు, స్టేడియాలకు వచ్చేవారు వ్యాక్సినేషన్ కార్డు తప్పనిసరిగా చూపించాలనే నిబంధన తీసుకొచ్చింది. స్వదేశీ విమాన ప్రయాణాలకూ టీకా సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. జనవరి 17 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని ప్రకటన జారీ చేసింది.
ఇదీ చదవండి:దిల్లీలో 22వేల కొత్త కరోనా కేసులు- ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు