తెలంగాణ

telangana

By

Published : Sep 3, 2021, 4:23 PM IST

Updated : Sep 3, 2021, 7:18 PM IST

ETV Bharat / international

తాలిబన్‌ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్‌!

తాలిబన్‌ ప్రభుత్వ అధినేతగా ముల్లా బరాదర్‌ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. తాలిబన్‌ వ్యవస్థాపకుడు (afghan taliban) ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌, షేర్ మహమ్మద్‌ స్టాన్జాయ్‌లకు కీలక స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది.

afganistan news
తాలిబన్‌ ప్రభుత్వాధినేతగా ముల్లా బరాదర్‌..!

తాలిబన్‌ ప్రభుత్వ అధినేతగా ముల్లా బరాదర్‌ పేరును శుక్రవారం (afghan taliban) ఖరారు చేసినట్లు సమాచారం. ఆయన ఇప్పటి వరకు తాలిబన్ల పొలిటికల్‌ ఆఫీస్‌ అధిపతిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని ముగ్గురు తాలిబన్‌ నాయకులు ధ్రువీకరించినట్లు ఆంగ్ల వార్త సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ఇక తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌, షేర్ మహమ్మద్‌ స్టాన్జాయ్‌లకు (afghanistan news) కీలక స్థానాలు దక్కనున్నాయి.

అమెరికాతో చర్చలతో వార్తల్లోకి..

అఫ్గాన్‌లో యుద్ధాన్ని ముగించాలని ట్రంప్‌ సర్కారు భావించడం వల్ల తాలిబన్లతో చర్చలకు తెరలేచింది. అమెరికా- తాలిబన్ల మధ్య ఫిబ్రవరి29న ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో 2020 మార్చిలో నాటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ కాల్‌లో బరాదర్‌తో మాట్లాడారు. అఫ్గానిస్థాన్‌లో హింసను ఆపాలని కోరారు. ఈ ఘటన తర్వాత బరాదర్‌ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. తాలిబన్‌ ప్రతినిధిగా ఆయన వివిధ దేశాల నాయకులతో చర్చలు జరిపారు. ఇటీవల చైనాను సందర్శించిన తాలిబన్‌ బృందానికి బరాదర్‌ నాయకత్వం వహించారు.

తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు‌..

అఫ్గానిస్థాన్‌లోని ఉర్జాన్‌ ప్రావిన్స్‌లోని వీట్‌మాక్‌లో 1968లో బరాదర్‌ దుర్రానీ పష్తూన్‌ తెగలో జన్మించాడు. పెరిగిందంతా కాందహార్‌లోనే. 1970ల్లో సోవియట్‌ ఆక్రమణ తర్వాత తిరుగుబాటు బృందంలో చేరాడు. అప్పట్లో ఒంటికన్ను ముల్లా ఒమర్‌తో కలిసి సోవియట్‌ సేనలపై పోరాటం చేశాడు. సోవియట్‌ సేనలు అఫ్గానిస్థాన్‌ నుంచి వెళ్లిపోయాక దేశంలో అవినీతి, అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముల్లా ఒమర్‌తో కలిసి తాలిబన్‌ను స్థాపించాడు.

ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌లో 1996 నుంచి 2001 వరకు తాలిబన్‌ పాలన సాగింది. ఈ సమయంలో హెరాత్‌, నిమ్రూజ్‌ ప్రావిన్స్‌లకు గవర్నర్‌గా, పశ్చిమ అఫ్గాన్‌ కోర్‌ కమాండర్‌గా వ్యవహరించాడు. తాలిబన్‌ ఆర్మీకి డిప్యూటీగా పనిచేసినట్లు అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ పత్రాలు వెల్లడిస్తున్నాయి. కాబుల్‌లో సెంట్రల్‌ఆర్మీ కోర్‌ కమాండర్‌గా కూడా పనిచేశాడు. ఇంటర్‌పోల్‌ మాత్రం అతడిని నాటి అఫ్గాన్‌ డిప్యూటీ మినిస్టర్‌ ఆఫ్‌ డిఫెన్స్‌గా పేర్కొంది. తాలిబన్‌ సైన్యం కోసం కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పుస్తక రూపంలో బరాదర్‌ రాశాడు.

అలా పరారీ..

2001లో అమెరికా దాడుల సమయంలో బరాదర్‌ తన మిత్రుడు ముల్లా ఒమర్‌తో కలిసి మోటార్‌ సైకిల్‌పై పర్వతాల్లో పలాయనం చిత్తగించాడు. తర్వాత తిరుగుబాటుదారుల పాలన గుర్తింపు కోసం నాటి అధ్యక్షుడు హమీద్‌ ఖర్జాయ్‌తో చర్చలు జరిపాడు.

2010 ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం వేళ పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌, అమెరికాకు చెందిన సీఐఏ సిబ్బంది బరాదర్‌ను కరాచీ నగరంలో అదుపులోకి తీసుకొన్నారు. వారం తర్వాత పాక్‌ ఈ వార్తను ధ్రువీకరించింది. ఖర్జాయ్‌ ప్రభుత్వం బరాదర్‌తో జరుపుతున్న చర్చలను అడ్డుకొనేందుకు పాక్‌ దీనిని వాడుకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. 2018లో అమెరికా ఒత్తిడితో పాక్‌ బరాదర్‌ను విడుదల చేసింది. తర్వాత ఆయన్ను ఖతార్‌కు తరలించి తాలిబన్‌ పొలిటికల్‌ ఆఫీస్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.

సెప్టెంబర్​ 4న కీలక ప్రకటన..

అఫ్గానిస్థాన్​లో ప్రభుత్వ ఏర్పాటుపై సెప్టెంబర్​ 4న ప్రకటన చేయనున్నట్లు తాలిబన్​ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్​ తెలిపారు. శుక్రవారమే ప్రకటన చేయాల్సి ఉన్నా ఒక రోజు వాయిదా పడినట్లు చెప్పారు. చర్చలు పూర్తయ్యాయని, కేబినెట్​ కూర్పుపై మాత్రమే తుది నిర్ణయం మిగిలి ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి :Taliban on Kashmir: కశ్మీర్​పై మాట మార్చిన తాలిబన్లు!

Last Updated : Sep 3, 2021, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details