పశ్చిమాసియా దేశాల్లో 50 వేలకు చేరిన మరణాలు - కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు 2.64 కోట్ల కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 8.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియా దేశాల్లో మరణాల సంఖ్య 50 వేలకు చేరుకుంది.
కరోనా వైరస్
By
Published : Sep 4, 2020, 8:52 AM IST
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. రోజూ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.64 కోట్ల మందికి వైరస్ సోకింది. 8.73 లక్షల మంది మృత్యువాత పడగా.. 1.86 కోట్ల మంది కోలుకున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి అమెరికాలో తీవ్రంగా ఉంది. దేశంలో కొత్తగా 44,507 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల సంఖ్య 63 లక్షలు దాటింది. మరో 1,094 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 1.91 లక్షలకు చేరింది. ఈ పరిస్థితుల్లోనూ న్యూయార్క్‌లో రెస్టారెంట్లను తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
బ్రెజిల్లో..
వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న మరో దేశం బ్రెజిల్లో తాజాగా 44 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 40.46 లక్షలకు చేరింది. వైరస్ బారిన పడి మరో 830 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు బ్రెజిల్లో మొత్తం 1.24 లక్షల మంది మరణించారు.
పశ్చిమాసియాలో..
పశ్చిమాసియా దేశాల్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఈ దేశాలన్నింటిలో కలిపి వైరస్ కారణంగా ఇప్పటివరకు 50 వేల మంది మృతి చెందారు. ఈ దేశాల్లో కరోనా వ్యాప్తిలో ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం 3.8 లక్షల కేసులు నమోదు కాగా 21,900 మంది మరణించారు.
ఇజ్రాయెల్‌లోనూ వైరస్ క్రమంగా విజృంభిస్తోంది. ఈ దేశంలో కొత్తగా రికార్డు స్థాయిలో 3 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్‌లో 1.2 లక్షల మందికి వైరస్ సోకగా.. 985 మంది మరణించారు.