కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత మన దేశంలో ఏం జరుగుతోంది? దుకాణాలు తెరిచారు.. బస్సులు నడుపుతున్నారు. విమానాలూ ఎగురుతున్నాయ్. కువైట్‌లోనూ అదే జరిగింది. అయితే.. ఒక విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. అదేంటంటే.. అన్ని దేశాల్లో సరుకుల కోసమో, ఆహారం కోసమో క్యూ లైన్లలో నిలబడ్డారు. కువైట్‌లో మాత్రం నగల దుకాణాల వద్ద సందడి కనిపించింది. అవును.. మీరు చదివింది నిజమే.
కారణాలు తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ధనవంత దేశాల్లో ఒకటి కువైట్. మరి నగల షాపుల ముందు ప్రజలు బారులు తీరడం పెద్ద వింతేమీ కాదని అనుకోవచ్చు. అయితే దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుందేమోనన్న భయంతో, తమకు భరోసా ఉండేందుకే బంగారాన్ని కొనుగోలు చేయాలని అక్కడి పౌరులు భావించడమే ప్రస్తుత స్థితికి కారణం.
సంక్షోభం.. ఎందుకంటే..
కరోనా కోరలు ప్రపంచమంతటా విస్తరించాయి. గిరాకీ కొరవడి చమురు ధర జీవనకాల కనిష్ఠాలకు చేరింది. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశమైన కువైట్‌కు ఆదాయం భారీగా తగ్గింది. ఎన్నడూ లేనంతగా ఆ దేశం రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
- ఇతర గల్ఫ్ దేశాల లాగానే కువైట్ కూడా తన దేశంలోని 90 శాతం మంది పౌరులకు ఉద్యోగాలిచ్చింది. భారీ ప్రయోజనాలను అందజేస్తోంది.
- అంతే కాదు.. చౌక విద్యుత్, ఇంధనంతో పాటు.. ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్యను పౌరులకిస్తోంది. అయితే కరోనాతో అంతా తల్లకిందులైంది. చమురు ధరలు తగ్గడంతో దేశం ఆదాయం క్షీణించడంతో వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి త్వరలోనే రావొచ్చని ఆ దేశ ఆర్థిక మంత్రే హెచ్చరించారు.
- మరో వైపు ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా మూడీస్ కువైట్ సార్వభౌమత్వ రుణ రేటింగ్‌ను తగ్గించింది కూడా.
- ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో దేశ లోటు 40 శాతానికి చేరొచ్చని కువైట్ జాతీయ బ్యాంకు అంచనా వేసింది. 1990ల్లో ఇరాక్ దండయాత్ర, గల్ఫ్ యుద్ధం సమయంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ సంక్షోభం రావడం ఇదే తొలిసారి.