జోర్డాన్‌లో అవినీతి రాజ్యమేలుతోందని, వాక్ స్వాతంత్య్రం కొరవడిందని, పాలన అస్తవ్యస్తంగా సాగుతోందంటూ రాజు అబ్దుల్లా-2 సవతి సోదరుడు ప్రిన్స్ హంజా బిన్ హుస్సేన్ వీడియో సందేశంలో చేసిన వ్యాఖ్యలను ఆ దేశ అధికారులు ఖండించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు హంజా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హంజాను గృహ నిర్బంధంలో ఉంచినట్లు వచ్చిన ఆరోపణలను సైన్యాధిపతి జనరల్ యూసఫ్ హునైటీ ఖండించారు. దేశ భద్రత, సుస్థిరతకు హాని కలిగించే చర్యలకు స్వస్తి పలకాలని మాత్రమే ఆయనకు సూచించినట్లు తెలిపారు.
ఈ అంశంపై దర్యాప్తు సాగుతోందని, అందులో తేలిన అంశాలను బహిర్గతం చేస్తామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన నాయకులను హంజా రెచ్చగొడుతున్నారని ఉప ప్రధాన మంత్రి అయమన్ సఫాది ఆరోపించారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు విదేశీ సంస్థలతో కలిసి కుట్ర పన్నుతున్నారని కూడా చెప్పారు. జోర్డాన్‌లో తిరుగుబాటు కుట్రను భగ్నం చేశామని, ఆ వ్యవహారంలో ప్రమేయమున్న 14-16 మందిని అరెస్టు చేసినట్లు మరో సీనియర్ అధికారి తెలిపారు.
హంజా ఆరోపణలేంటి?
జోర్డాన్ రాజు తీరుపై విమర్శలు చేస్తూ హంజా ఒక వీడియోను విడుదల చేశారు. శనివారం ఉదయం జోర్డాన్ సైన్యాధిపతి తన వద్దకు వచ్చారని చెప్పారు. ఇక నుంచి తాను ఇల్లు దాటడానికి వీల్లేదని, ప్రజలను కలవడానికి, వారితో మాట్లాడటానికి అనుమతించబోమని స్పష్టంచేసినట్లు ఆరోపించారు. తనకు ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని చెప్పారు. తన తాజా సందేశాన్ని రికార్డు చేయడానికి శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఉపయోగించానని, దాన్ని కూడా కట్ చేయబోతున్నారని తెలిపారు.
రాజు పేరు ప్రస్తావించకుండానే పాలనా వ్యవస్థపై హంజా విమర్శలు చేశారు. దేశ ప్రజల జీవితాలు, భవిష్యత్ కన్నా స్వీయ ప్రయోజనాలు, అవినీతికే ప్రాధాన్యం దక్కుతోందని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా తాను కుట్రలు పన్నానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అక్రమాలను ప్రశ్నించేవారిపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఇక్కడ ఆనవాయితీయేనని చెప్పారు. అంతకుముందు హంజా తల్లి క్వీన్ నూర్.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. 'అమాయక బాధితుల'కు న్యాయం జరుగుతుందన్నారు.