పాలస్తీనా ఉగ్రవాదులు చేసిన రాకెట్ దాడులకు ప్రతిస్పందనగానే తమ దేశం వైమానిక దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తెలిపారు. మరింత శక్తివంతంగా విరుచుకుపడతామని హెచ్చరించారు. వారం రోజులుగా పాలస్తీనా మిలిటెంట్లు తమపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నారని.. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వివరించారు. ఇటువంటి చర్యలను ఏ దేశమూ సహించబోదని స్పష్టం చేశారు. దేశ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దాడులకు స్పందిస్తున్నామని పేర్కొన్నారు.
గాజాలోని అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో స్థావరాల్లు ఏర్పరచుకుని హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడుతున్నట్లు నెతన్యాహు ఆరోపించారు. ఇజ్రాయెల్ ఓ సీనియర్ హమాస్ కమాండర్ ఇంటిపై దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆ దాడికి కారణం...
గాజాలో అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్‌తో పాటు అల్ జజీరాలు ఉండే భవనంపై ఇజ్రాయెల్ బలగాలు క్షిపణి దాడి చేశాయి. దీంతో ఆ భవనం కూలిపోయింది. వార్త సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం పట్ల వివరణ ఇవ్వాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని సంబంధిత సంస్థలు డిమాండ్ చేశాయి. దీనిపై అసోసియేట్ ప్రెస్ సీఈఓ గ్యారీ ప్రూట్ స్పందించారు. గాజాలో ఏం జరుగుతోంది అనేది ప్రపంచానికి ఇప్పడు చాలా తక్కువ తెలుస్తోందని అన్నారు.