'పెగసస్'.. ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచాన్ని కుదిపేస్తోన్న అంశం. ఈ స్పైవేర్ దుర్వినియోగంపై ఆరోపణలతో దాని మాతృ సంస్థ అయిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్పైవేర్‌ను వినియోగిస్తోన్న పలు దేశాల్లోని క్లయింట్లను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు అమెరికా మీడియా తెలిపింది.
ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన మీడియా సంస్థల కన్సార్టియం.. స్పైవేర్‌ను ఉపయోగించి హ్యాకింగ్, ఫోన్ల ట్యాపింగ్, నిఘా కోసం ఉపయోగించినట్లు నివేదిక సమర్పించింది. ఈ దర్యాప్తును అనుసరించే పలు దేశాలను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'కొందరు వినియోగదారులపై దర్యాప్తు జరిగింది. అందులో కొందరిని తాత్కాలికంగా బ్లాక్ చేశారు.' అని ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓలోని ఓ ఉద్యోగి తెలిపినట్లు నేషనల్ పబ్లిక్ రేడియో(ఎన్పీఆర్) వెల్లడించింది. అయితే.. ఏ ప్రభుత్వాలు, దేశాలు అనేది బయటకి చెప్పలేదని తెలిపింది.
ఈ స్పైవేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన కొన్ని ఫోన్ నంబర్లను పరిశీలిస్తూ.. అంతర్గతంగా దర్యాప్తు చేపడుతోంది ఎన్ఎస్ఓ. ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించామని, ఆ ఫోన్లతో పెగసస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలినట్లు సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే.. పెగసస్ దుర్వినియోగం అయిందనే అంశాన్ని కప్పిపుచ్చుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానమివ్వకపోవటం గమనార్హం. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఎన్ఎస్ఓపై ఇజ్రాయెల్ దర్యాప్తు..