ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. తాను గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. తుది ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ తన నేతృత్వంలోని రైట్ వింగ్ లికుడ్ పార్టీకి దేశ ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని మంగళవారం సాయంత్రం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
''నా నాయకత్వంలోని రైట్ వింగ్ లికుడ్ పార్టీకి ఇజ్రాయెలీలు గొప్ప విజయాన్ని అందించారు.''
- బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దేశంలో అతి పెద్ద పార్టీగా 'లికుడ్' అవతరించింది. రైట్ వింగ్ పార్టీలూ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి, కానీ ఇందులో కొన్ని నెతన్యాహుకు వ్యతిరేకమని, ఈ నేపథ్యంలో ఆయన తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విషయంలో అనిశ్చితి నెలకొందని అంచనా వేశాయి.
మళ్లీ ప్రతిష్టంభన..
ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగే సూచనలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఏ ఒక్కరూ మెజార్టీ సాధించలేదని అంచనా వేశాయి.
120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆధిక్యం కోసం 61 స్థానాలు అవసరం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. మిత్రపక్షాలతో కలిసి నెతన్యాహు పార్టీకి 53-54 సీట్లు, ఆయన ప్రత్యర్థులు 59 స్థానాల్లో గెలిచే అవకాశముంది.
అయితే.. ఇక్కడ నటాలీ బెన్నెట్‌కు చెందిన యామినా పార్టీ కీలకంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ.. 7-8 స్థానాల్లో గెలవొచ్చని తెలుస్తోంది.
తుది ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లెక్కలతో సరితూగితే.. వారికి నటాలీ మద్దతు అత్యవసరం. అయితే.. తనకు ప్రధానిగా అవకాశమిస్తే మద్దతిస్తానని నటాలీ చెప్పడం విశేషం. పూర్తి ఫలితాలు వెలువడేందుకు రోజులు పట్టొచ్చు. అప్పటివరకు నెతన్యాహు భవితవ్యంపై అనిశ్చితి వీడేలా లేదు.
రెండేళ్లలో నాలుగు సార్లు..
ఇజ్రాయెల్‌లో రెండేళ్ల వ్యవధిలో ఇప్పుడు జరిగినవి నాలుగో ఎన్నికలు. అధికారం చేపట్టి 7 నెలలు గడవకముందే గతేడాది డిసెంబర్లో నెతన్యాహు ప్రభుత్వం కుప్పకూలింది. గడువులోపు బడ్జెట్‌ను ఆమోదించడంలో పార్లమెంట్ విఫలం కావడం వల్ల సర్కార్ పడిపోయింది. దీంతో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇదీ చూడండి:పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు మోదీ లేఖ