భారత్ సహా ప్రపంచ దేశాల్లోని నాయకుల ఫోన్లపై నిఘా పెట్టిన వ్యవహారంపై పెగాసస్(Pegasus Software) రూపకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్ వ్యవస్థాకుడు షలీవ్ హులియో స్పందించారు. ఆయన 'ది వాషింగ్టన్ పోస్టు'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ కంపెనీ ఎంతో మంది జీవితాలను కాపాడిందని చెప్పుకొచ్చారు. నాయకులపై నిఘా వ్యవహారం కొందరు చేసిన చెత్తపనిగా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రత, నిఘా సంస్థల రోజువారీ పనిపై మరింత అవగాహన రావాల్సి ఉందన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించే మాట్లాడటం తనను బాధపెడుతోందన్నారు.
దుర్వినియోగం నిజమే
తమ సాఫ్ట్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు కాపాడిందో చెప్పగలమని... కానీ, ఆ విషయాలను ప్రస్తావించదలుచుకోలేదని షలీవ్ వెల్లడించారు. కొంత మంది వినియోగదారులు తమ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ, ఆయన ఎవరి పేరును వెల్లడించలేదు. సౌదీ, దుబాయ్, మెక్సికోలోని కొన్ని ఏజెన్సీలకు సహా ఐదుగురు కస్టమర్లకు ఈ సాఫ్ట్‌వేర్ విక్రయించడం ఆపేశామన్నారు.