పాలస్తీనాలోని గాజాపై బుధవారం మరోమారు వైమానిక దాడులు చేపట్టింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఆరుగురు మరణించారు. బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా రాకెట్ దాడులను ముమ్మరం చేసినట్లు సైన్యం తెలిపింది.
బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చేసే ముందు హెచ్చరిక క్షిపణి ఆ భవనాన్ని తాకిందని అనంతరం ఐదు నిమిషాల్లోనే భవనాన్ని క్షిపణి కూల్చేసిందని అధికారులు తెలిపారు. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లోని ఉగ్రవాద లక్ష్యాలను క్షిపణి తాకినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. 25 నిమిషాల వ్యవధిలో 52 విమానాలు 40 లక్ష్యాలపై క్షిపణునులు ప్రయోగించాయని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ దాడిలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడ్డారని పేర్కొంది.