ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాకెట్ల దాడి కొనసాగుతోంది. ఆదివారం తిరిగి గాజాపై వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ దాడిలో నగరంలోని పలు భవంతులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. స్థానికంగా ఉండే ప్రజలు, జర్నలిస్టులు దాడికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. గాజా స్ట్రిప్‌లో అతిపెద్ద ఆసుపత్రి అయిన షిఫాకు వెళ్లే మార్గమధ్యంలో పెద్ద గుంతలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఈ దాడిలో ఇద్దరు మరణించిట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 25 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు చెప్పింది. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురిని బయటకు తీసినట్లు చెప్పారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ మిలిటరీ ఎటువంటి ప్రకటన చేయలేదు. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటివరకు చాలా మంది మరణించగా, ఎందరో గాయపడ్డారని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ మహ్మద్ అబూ సెల్మియా ఒక ప్రకటనలో తెలిపారు.