ఏడు దశాబ్దాల విభేదాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న తొలి గల్ఫ్ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టించింది. అమెరికా ప్రొద్బలంతో పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని వివాదాస్పద ప్రాంతాల ఆక్రమణను నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినందున యూఏఈ ఈమేరకు శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ శాంతి ఒప్పందంపై ట్విట్టర్‌లో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...ఇద్దరు స్నేహితుల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిందని ప్రశంసించారు. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు, అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ నాయకులు అంగీకరించారని శ్వేథ సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు త్వరలోనే ఒక రోడ్‌మ్యాప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు యూఏఈ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఈమేరకు వచ్చే వారంలో పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడులు, పర్యాటకం, విమాన యానం, ఇంధనం, పర్యావరణం, వైద్యం వంటి రంగాల్లో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండనున్నట్లు తెలిపారు.