తెలంగాణ

telangana

ETV Bharat / international

శునకాలు ఆ తప్పు చేస్తే.. యజమానులకు తిప్పలే! - శునకాల వ్యర్థాలతో డీఎన్​ఏ డేటాబేస్

నేర పరిశోధనలు, దొంగలను పట్టుకునేందుకు డీఎన్​ఏ ఉపయోగించడం ఇప్పటివరకు చూసుంటాం. కానీ శునకాలు చేసిన ఓ పని.. ఆ నగర మున్సిపల్ అధికారులకు తలనొప్పిగా మారింది. దీంతో వాటి వ్యర్థాలతో డీఎన్​ఏ డేటాబేస్ రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ శునకాలు ఏం చేశాయి? ఆ నగరం ఏంటి?

dna database
శునకాల మలంతో డీఎన్​ఏ

By

Published : Jul 28, 2021, 12:38 PM IST

ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరాల్లో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ ఒకటి. ఇంత అందమైన నగరాన్ని శునకాల వ్యర్థాల సమస్య తీవ్ర ఇబ్బంది పెడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు యజమానులకు జరిమానాలు విధించిప్పటికీ సమస్య అదుపులోకి రాలేదు. దీనితో శునకాల మలంతో 'డీఎన్​ఏ డేటాబేస్​'ను రూపొందించే పనిలో పడ్డారు. దీనితో సదరు యజమానులకు మెయిల్ ద్వారానే భారీ జరిమానాలు విధించనున్నారు.

"రెండు శాతం శునక యజమానుల చర్యల వల్ల అద్భుతమైన నగర అందాలు నాశనమవుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి నెలా అర టన్నుకు పైగా వ్యర్థాలను శుభ్రం చేస్తున్నారు"

--ఐటాన్ స్క్వార్ట్జ్, టెల్ అవీవ్ మున్సిపల్ అధికారి

టెల్ అవీవ్ నగర వ్యాప్తంగా దాదాపు 40వేల శునకాలు ఉన్నాయని అంచనా. ఇక్కడ ప్రతి 11 మందిలో ఒకరికి ఓ శునకం ఉంది. ప్రస్తుతం అమలు చేయబోయే డీఎన్​ఏ సాంకేతికతతో శునకాలు వదిలిన వ్యర్థాలను పరీక్షించి, యజమానిని సులువుగా గుర్తిస్తారు. మెయిల్ ద్వారా సదరు వ్యక్తికి జరిమానా విధిస్తారు.

"ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించాం. బాధ్యతాయుతమైన శునక యజమానులందరూ డేటాబేస్​లో తమ జంతువుల సమాచారాన్ని కచ్చితంగా నమోదు చేయాలి. ఈ సాంకేతికత ద్వారా బహిరంగ ప్రదేశాల్లో విసర్జించే శునకాలను గుర్తించడం సులువు అవుతుంది"

--ఐటాన్ స్క్వార్ట్జ్, టెల్ అవీవ్ మున్సిపల్ అధికారి

'శునకాల యజమానులు తమ పెంపుడు జంతువులకు లైసెన్స్ పొందాలంటే 'మలం డీఎన్​ఏ'లో నమోదవ్వడం తప్పనిసరి. లేదంటే లైసెన్సులను రెన్యువల్ చేయరు, కొత్తవాటినీ ఆమోదించరు' అని మున్సిపల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గతేడాది బహిరంగ ప్రదేశాల్లో శునకాల వ్యర్థాలకు సంబంధించి మున్సిపల్ కాల్​సెంటర్​కు దాదాపు 6,766 ఫిర్యాదులు అందాయి.

విభిన్నమే.. కానీ..

శునకాల డీఎన్​ఏ డేటాబేస్ రూపొందించాలన్న ఆలోచన కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ.. ఈ తరహా ఆలోచన ఇతర నగరాల్లో అమల్లో ఉంది. శునకాల దొంగతనాలు పెరిగిపోయిన నేపథ్యంలో బ్రిటన్​లోని గ్లౌసెస్టర్ షైర్ నగర పోలీసులు 'డీఎన్ఏ ప్రొటెక్టెడ్' పేరిట పెంపుడు జంతువుల డేటాబేస్​ను రూపొందించారు. 75 యూరోలు చెల్లించి యజమానులు ఇందులో తమ శునకాల డీఎన్​ఏను నమోదు చేసుకోవచ్చు. ఇది బ్రిటన్​లోని పోలీసులందరికీ అందుబాటులో ఉంటుంది. తద్వారా దొంగతనాలను అరికట్టవచ్చు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details