పరస్పర దాడులతో ఇజ్రాయెల్- పాలస్తీనాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో గాజాలోని 9 మంది హమాస్ ఉగ్రవాదుల ఇళ్లు, సొరంగాలు ధ్వంసమయ్యాయి. ఎంతమంది చనిపోయారన్నది స్పష్టత లేదు.
ఇజ్రాయెల్ దాడులకు గాజా నగరం ఉలిక్కిపడింది. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటినుంచి ఇంత పెద్ద ఘర్షణలు చూడలేదని స్థానికులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందటి వాటితో పోలిస్తే.. ఇవాళ జరిపిన దాడులు భీకరమైనవిగా అభిప్రాయపడుతున్నారు.
ఈ దాడులపై 10 నిమిషాల ముందే ఇజ్రాయెల్ సైన్యం నుంచి సైరన్ వచ్చింది. అప్రమత్తమైన ప్రజలు.. తమ నివాసాలను ఖాళీ చేయగా ప్రాణనష్టం తప్పింది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఎక్కువ భాగం రాకెట్లు.. వ్యవసాయ భూముల్లోనే పడినట్లు స్థానికులు తెలిపారు.
గాజా నగరంపై ఆదివారం జరిపిన వాయుదాడుల్లోనూ 42 మంది చనిపోయారు. మూడు ఎత్తైన భవనాలు నేలమట్టమయ్యాయి.
దాడులు ఇలాగే కొనసాగితే.. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు గాజా మేయర్.
ఐరాస హెచ్చరిక..
దాడులపై స్పందించిన ఐక్యరాజ్యసమితి.. గాజా భూభాగంలోని ఏకైక విద్యుత్ కేంద్రంలో ఇంధనం అయిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గాజా వాసులు ఇప్పటికే విద్యుత్తు కోతతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
గాజాకు మరో రెండు, మూడు రోజులు మాత్రమే విద్యుత్ సరఫరా చేయగలుగుతామని వివరించారు విద్యుత్ పంపిణీ కేంద్రం అధికారులు. ఇజ్రాయెల్ దాడులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు.
- ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో.. 198 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో 58 మంది చిన్నపిల్లలు, 35 మంది మహిళలు. మరో 1300 మందికిపైగా గాయాలయ్యాయి.
- గాజా రాకెట్ దాడుల్లో.. ఇజ్రాయెల్‌కు చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదేళ్ల బాలుడు సహా ఓ సైనికుడు ఉన్నారు.
అత్యవసర సమావేశం..
ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య నెలకొన్న హింసపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) అత్యవసర సమావేశమైంది. ఈ భేటీలో ఐరాస దౌత్యవేత్తలు, ఇస్లాం దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.