అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను తాను కలవనని ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన( Iran New president) సయ్యద్ ఇబ్రహీం రైసీ తేల్చిచెప్పారు. బాలిస్టిక్ మిసైల్ ప్రొగ్రామ్ సహా స్థానిక మిలిటెంట్లకు మద్దతుపై బైడెన్‌తో చర్చించేందుకు రైసీ విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తొలగించాల్సిన బాధ్యత అమెరికాకు ఉందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి. అయితే ఆ దేశ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఎన్నికవడం వల్ల ఈ పునరుద్ధరణపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను అమెరికా తొలిగించడమే ఆ దేశంతో విదేశాంగ విధానాలకు మూలం అని రైసీ వ్యాఖ్యానించారు. ఈ చర్యలను అమెరికా అమలు చేస్తేనే అణు ఒప్పందంలో భాగం అవుతామని స్పష్టం చేశారు.
'మానవ హక్కుల రక్షకుడిని'
1988లో జరిగిన ఊచకోతపై రైసీని ప్రశ్నించగా తాను మానవ హక్కుల రక్షకుడిని అంటూ వ్యాఖ్యానించారు. 1988 ఇరాన్-ఇరాక్ యుద్ధానంతరం 5000 మందికిపైగా రాజకీయ ఖైదీలు ఊచకోతకు గురయ్యారు. ఈ ఘటనలో కీలక పాత్ర వహించిన రైసీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
"మానవ హక్కులు, ప్రజల భద్రతకు సంరక్షకుడిగా సహా న్యాయవాదిగా నేను చేపట్టిన బాధ్యతల పట్ల గర్వపడుతున్నాను. నేను విధుల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం మానవ హక్కులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదే. ఈ రోజు అధ్యక్షునిగా మరోసారి మానవ హక్కులను సంరక్షించే బాధ్యత నా మీద ఉంది."
-సయ్యద్ ఇబ్రహీం రైసీ, ఇరాన్ నూతన అధ్యక్షుడు