ఐక్యరాజ్య సమితి పరిశీలకులకు.. ఇరాన్ తమ అణు కార్యకలాపాల గురించి తక్కువ సమాచారాన్ని అందుబాటులో ఉంచనుందని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫేల్ గ్రోసీ తెలిపారు. అయితే ఇప్పటికైతే ఆ కార్యక్రమాలపై పర్యవేక్షించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర పర్యటన కోసం ఇరాన్ వెళ్లిన ఆయన.. అణు కార్యక్రమాలపై ఆ దేశంతో 'సాంకేతిక అవగాహన' కుదుర్చుకున్నట్లు చెప్పారు. మూడు నెలల వరకు ఇరాన్ అణు కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆ దేశం అనుమతించనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిశీలకుల సంఖ్య ఇది వరకు స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. కార్యాచరణలోనే మార్పు ఉంటుందన్నారు.
"ఇప్పటివరకు అస్థిరంగా ఉన్న పరిస్థితులను మార్చాలనే ఐఏఈఏ కోరుకుంటోంది. సాంకేతిక అవగాహన వల్ల ఇది సాధ్యమవుతుంది. దీని వల్ల ఇతర రాజకీయ సంప్రదింపులు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న అస్పష్టమైన పరిస్థితిని నివారించగలగడం ఇంకో ముఖ్యమైన విషయం. ఇప్పుడు కూడా పర్యవేక్షణ సంతృప్తికరంగానే కొనసాగుతుంది."
-రాఫెల్ గ్రోసీ, ఐఏఈఏ డైరెక్టర్ జనరల్