వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో దూకుడు పెంచింది ఇరాన్. 2015 ఒప్పందంలోని కొన్ని అంశాలను ఉల్లంఘిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ఆంక్షలు పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ మేరకు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ దేశాలకు అల్టిమేటం జారీ చేసింది. 60 రోజుల్లోగా ఆంక్షల ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని కోరింది. లేని పక్షంలో 2015 ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించి.. పరిమితికి మించి యురేనియం నిల్వ చేస్తామని హెచ్చరించింది.
ఇరాన్‌పై ఇటీవలే ఆంక్షలు పునరుద్ధరించింది అమెరికా. తమపై దాడికి ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ముందు జాగ్రత్తగా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు మోహరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ నేపథ్యం
ఇరాన్ వివాదాస్పద అణు కార్యక్రమాలను ఆపేలా 2015లో ఒప్పందం కుదిరింది. ఈ ఒడంబడికలో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ భాగస్వాములు. ఒప్పందం ప్రకారం.. ఇరాన్ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించారు. వాటికి లోబడి ఇరాన్ వ్యవహరిస్తే ఆ దేశంపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదో చెత్త ఒప్పందమంటూ గతేడాది వైదొలిగిన అమెరికా... ఇరాన్‌పై ఆంక్షలను పునరుద్ధరించింది. ఈ చర్య ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఏకపక్ష చర్యపై ఇరాన్ అభ్యంతరం తెలిపింది. ఒప్పందానికి లోబడి వ్యవహరించినా... ఆంక్షలు పునరుద్ధరించటాన్ని వ్యతిరేకించింది.
60 రోజుల గడువులో ఆంక్షల నుంచి విముక్తి కలగపోతే ఒప్పందంలోని మరిన్ని నిబంధనలను ఉల్లంఘిస్తామని ఇరాన్ ప్రకటించింది. పరిమితికి మించి యురేనియం, భార జలాలను నిల్వ చేస్తామని ఇతర సభ్య దేశాలను హెచ్చరించింది. అణు ఒప్పందాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.