ప్రపంచ దేశాలను కరోనా వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వైరస్ కేంద్రబిందువైన చైనాలో మృతుల సంఖ్య తగ్గుతుండగా.. ఇతర దేశాల్లో గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్లో వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ఆ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 77మంది మరణించారు.
ఇరాన్లో 23మంది చట్టసభ్యులకు కుడా కరోనా సోకడం ఆందోళన కలిగించే అంశం. అనేకమంది చట్టసభ్యులు వీరికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు ఇరాన్ సుప్రీమ్ నేత అయాతుల్లాహ్ అలీ ఖామేనేయీ. అవసరమైనప్పుడు ఆరోగ్యశాఖ అధికారులకు సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 3లక్షల మంది సైనికులతో కరోనాపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
దేశాల సంఖ్య...
మరోవైపు కరోనా బారినపడుతున్న దేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ జాబితాలోకి తాజాగా ఉక్రెయిన్ చేరింది. 70దేశాలకుపైగా వ్యాపించిన ఈ వైరస్... ఇప్పటి వరకు దాదాపు 3వేల 100మందిని బలితీసుకుంది. మరో 90వేల మందికి వైరస్ సోకింది.
ఇటలీలోనూ ఇదే పరిస్థితి. తాజాగా పోప్ ఫ్రాన్సిస్‌కు జలుబు చేయడం, దగ్గు రావడం వల్ల అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పరీక్షల్లో వైరస్ లక్షణాలు కనపడకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.