తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి..? - IRAN LATEST NEWS

ఇరాక్​లోని​ అమెరికా స్థావరాలే లక్ష్యంగా 12కుపైగా క్షిపణి దాడులు జరిపింది ఇరాన్​. ఆత్మ రక్షణ కోసమే ఈ దాడి చేసినట్టు ఇరాన్​ స్పష్టం చేసింది. ఈ ఘటనపై అమెరికాలోని శ్వేతసౌధంలో అత్యవసర సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులను అధ్యక్షుడు ట్రంప్​న​కు వివరించారు అధికారులు. అయితే ఈ దాడిలో కనీసం 80 మంది మరణించారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Iran launches missile strike against US in Iraq
అమెరికా దళాలే లక్ష్యంగా ఇరాన్​ క్షిపణి దాడులు

By

Published : Jan 8, 2020, 9:29 AM IST

Updated : Jan 8, 2020, 12:51 PM IST

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి..?

అమెరికా-ఇరాన్​ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. తమ దేశ టాప్​ కమాండర్ ఖాసీం​ సులేమానీ మరణం అనంతరం ప్రతీకారేచ్చతో రగలిపోతున్న ఇరాన్​.. తాజాగా ఇరాక్​లోని అమెరికా భద్రతా దళాలకు చెందిన రెండు సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. డజనుకుపైగా బాలిస్టిక్​ క్షిపణులతో అల్​ అసద్​, ఇర్బిల్​ స్థావరాలపై దాడి జరిగినట్టు అమెరికా రక్షణశాఖ పెంటగాన్​ ధ్రువీకరించింది.

ఇరాన్​ క్షిపణి దాడుల్లో కనీసం 80 మంది మరణించినట్లు తెలుస్తోంది. 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' మరణించారని ఇరాన్​ అధికారిక టీవీ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తం 15 క్షిపణులతో దాడి చేశామని, అన్ని మిసైల్స్‌ లక్ష్యాన్ని చేరుకున్నాయని ఇరాన్‌ మీడియా పేర్కొంది.

ఆత్మ రక్షణ కోసమే...

ఈ ఘటనపై స్పందించిన ఇరాన్​ విదేశాంగ మంత్రి జావెద్​ జారిఫ్​.. ఆత్మ రక్షణ చర్యల్లో భాగంగా క్షిపణులతో దాడి చేసినట్టు తెలిపారు. తాము యుద్ధం కోరుకోవట్లేదని.. కానీ ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

శ్వేత సౌధం అలర్ట్​..

ఇరాన్​ ప్రతిఘటన అనంతరం శ్వేత సౌధంలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​న​కు తాజా పరిస్థితులు వివరించారు అధికారులు.

"అంతా బాగానే ఉంది. ఇరాక్​లోని రెండు మిలిటరీ స్థావరాలపై ఇరాన్​ క్షిపణులతో దాడి చేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అంతా బాగుంది. ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సైన్యం అమెరికా సొంతం. దీనిపై త్వరలోనే ఓ కీలక ప్రకటన చేస్తాను."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

విమానాలపై ఆంక్షలు...

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. ఇరాక్, ఇరాన్‌, ఒమన్, సౌదీఅరేబియాలకు జల, విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ దేశాలకు జల మార్గం, గగన తలంలో అన్ని రాకపోకలను నిషేధించినట్లు అమెరికా విమానయాన శాఖ వెల్లడించింది

Last Updated : Jan 8, 2020, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details